ప్రభాత ఉదయం, ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అధికార కాంగ్రెస్ ఓటర్ల నమోదు, ప్రచారంలో ముందంజలో ఉండగా.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రక్షణ సేన ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి (హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్), తీన్మార్ మల్లన్న (వరంగల్-ఖమ్మం-నల్లగొండ) పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 27తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికార వర్గాల అంచనా. దీంతో ఓటర్ల నమోదు ప్రక్రియపైనా పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి.
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్..
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే సామ రామ్మోహన్ రెడ్డి( మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్), రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి(వరంగల్ - నల్గొండ – ఖమ్మం)ని అభ్యర్థులుగా ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు బాధ్యతను నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు అప్పగించింది. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వం కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్ల నమోదును చేపడుతున్నాయి. మరోవైపు మిత్రపక్షాలు, ఇతర రాజకీయ శక్తుల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్‌తో కూడిన కాంగ్రెస్ బృందం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో సమావేశమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని కలిసి ఆ పార్టీ మద్దతును కూడా అభ్యర్థించింది.
అభ్యర్థుల కోసం బీఆర్‌ఎస్ అన్వేషణ..
ఈ ఎన్నికల్లో విజయం సాధించి పుంజుకోవాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. ఓటర్ల నమోదు కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉండటంతో ఆర్థికంగా బలంగా ఉన్న నేతల వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పట్టుతోపాటు ఆర్థిక వనరులు సమకూర్చుకోగల సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో ప్రస్తుతం బీఆర్‌ఎస్ తరఫున సురభి వాణీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆమె పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడి నుంచి ఓ ఐఆర్‌ఎస్ అధికారిని లేదా ఇతర సీనియర్ నేతలను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ ఆలోచిస్తోంది. మరోవైపు వామపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సీపీఐ, సీపీఎం మద్దతు ఎవరికి లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
బీజేపీ టికెట్ కోసం పోటీ..
పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కోసం బీజేపీలోనూ పోటీ నెలకొంది. గతంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన రాంచందర్‌రావు మరోసారి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ ముఖ్య నేతలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురి పేర్లతో కూడిన అభ్యర్థుల జాబితాలను రాష్ట్ర కమిటీ కేంద్ర నాయకత్వానికి పంపినట్లు సమాచారం. అభ్యర్థిపై అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో స్థానిక క్యాడర్ ఓటర్ల నమోదు ప్రక్రియలో పూర్తిస్థాయిలో పాల్గొనలేకపోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీఆర్ఎస్ నుంచి శ్రీకాంత్ గౌడ్..
కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ కూడా పోటీకి సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పేరును కవిత ఖరారు చేశారు. దసరా సందర్భంగా తమ పార్టీ తరఫున తొలి అభ్యర్థిని ప్రకటించారు. బీసీ నాయకుడికి అవకాశం కల్పించడం ద్వారా బహుజన నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాన్ని పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల్లో గెలవాలంటే బూత్ స్థాయిలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి, పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్లగలిగే బలమైన క్యాడర్ అవసరం. నిధులు, నెట్‌వర్క్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ వంటి ప్రధాన పార్టీలతో తెలంగాణ రక్షణ సేన ఎంతవరకు పోటీ పడగలదన్నది కీలకంగా మారనుంది.