తెలంగాణ

గల్ఫ్‌ మృతులు..ఆదుకునే దిక్కేది?

S. Pavan
  • 2014-2022 మధ్య 1,600 మందికిపైగా మృతి

  • 169 కుటుంబాలకే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా పథకం

  • 2023 డిసెంబర్‌ 7కు ముందు ఘటనలకు వర్తించని సాయం

ప్రభాత ఉదయం, జగిత్యాల : గల్ఫ్ దేశాల్లో అష్టకష్టాలు పడుతున్న తెలంగాణ కార్మికులు అక్కడ ఊహించని ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవటం బాధితుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నది. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై గత బీఆర్ఎస్ హయాంలో నాయకులు చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు బాధిత కుటుంబాలను పెద్దగా ఆదుకోలేకపోయాయి. ప్రభుత్వం నుంచి సంక్షేమ విధానం లేకపోవటం బాధిత కుటుంబాలకు తీరని అన్యాయం చేసింది. మృతుడి భార్యాపిల్లలు, అతడి తల్లిదండ్రులకు విరాళాలే దిక్కవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా పథకాన్ని తీసుకొచ్చినా, ఇది 2023 డిసెంబర్ 7 తర్వాత మరణాలకే వర్తిస్తున్నది. అంతకుముందు మృతి చెందిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు కూడా పథకాన్ని వర్తింపజేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

1,600 మందికిపైగా మృతి

అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, పనిప్రదేశాల్లో ప్రమాదాలు తదితర కారణాలతో అనేకమంది గల్ఫ్ దేశాల్లో ప్రాణాలు కోల్పోయారు. 2014 నుంచి 2022 మధ్య తెలంగాణకు చెందిన సుమారు 1,600 మందికిపైగా గల్ఫ్‌ కార్మికులు మృతిచెందినట్టు ప్రవాసీ మిత్ర లేబర్‌ యూనియన్‌ గతంలో పేర్కొంది. ఈ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని గల్ఫ్‌ కార్మిక సంఘాలు ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నాయి. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక విధానం తదితర చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నాయి. కాంగ్రెస్ సర్కార్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా పథకాన్ని 2024లో తీసుకొచ్చింది. 2023 డిసెంబర్‌ 7న లేదా ఆ తర్వాత మరణాలకు దీనిని వర్తింపజేసింది. దీని ప్రకారం 2025 మార్చి నాటికి 169 కుటుంబాలకు మొత్తం రూ.8.45 కోట్లు రెండు విడతలుగా సాయం అందింది. దీంట్లో జగిత్యాల జిల్లాకు చెందిన 19 కుటుంబాలు రూ.5 లక్షల సాయాన్ని అందుకున్నాయి. 2023 డిసెంబర్‌ 7కు ముందు మరణించిన కార్మికుల కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని గల్ఫ్ కార్మిక సంఘాలు, బాధిత కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

పెద్ద దిక్కు లేక..

జగిత్యాల రూరల్‌ మండలం అనంతారం గ్రామానికి గుర్రం మహేశ్ ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన కొద్ది రోజుల్లోనే రోడ్డు ప్రమాదంలో 2023 జూలై 6న మృతి చెందాడు. అతడికి భార్య పూజారాణి, ఇద్దరు పిల్లలు రిన్విత (9), వేదాన్షి (5) ఉన్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రవాసీ ప్రజాభవన్‌ను ఆశ్రయించిన పూజారాణి, ప్రమాద పరిహారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.

కూలి పనులతో పిల్లల పోషణ

రాయికల్‌కు చెందిన జనార్దన్‌ ఉపాధి కోసం ఖతార్‌ వెళ్లి 2018 మార్చిలో మృతిచెందాడు. అప్పటికి ఆయన వయసు 34 ఏళ్లు. భర్తను కోల్పోయిన దండుగుల లక్ష్మి, తన ఇద్దరు పిల్లలు శశి (15), అనిరుధ్ (10)లను పోషించుకునేందుకు కూలి పనులు చేయాల్సి వస్తున్నది. పిల్లల చదువులు, కుటుంబ పోషణ కోసం ప్రభుత్వ సాయాన్ని అర్ధిస్తున్నది. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా వర్తింపజేస్తే ఒక కుటుంబం నిలబడుతుందని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.