ప్రభాత ఉదయం, హైదరాబాద్: రాష్ట్రంలోని వివాదాస్పద భూములపై దసరా సెలవుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు హైడ్రాకు మార్గదర్శకాలు జారీ చేయాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి సూచించింది. ఈ నెల 17 నుంచి 25 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. అయితే చట్టప్రకారం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది.
తన వ్యవసాయ భూమిలో నిర్మించుకున్న పశువుల కొట్టాన్ని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చి వేశారని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడేనికి చెందిన సీలం లీలావతి హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్‌కు 20 ఏళ్ల నుంచి చింతగూడెంలో భూమి ఉందని ఆమె తరఫు న్యాయవాది వాదించారు.
భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలు, ధరణి పోర్టల్‌లోని రికార్డులు, పిటిషనర్ భర్త పేరుతో ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్లులను కోర్టుకు సమర్పించారు. స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఈ నెల 12న గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామస్థులు, స్థానిక ఎమ్మెల్యే భర్తతో కలిసి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరఫున రెవెన్యూ ఏజీపీ వాదనలు వినిపించారు. వివరాలు తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్ కుమార్ భూమిపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్ 12కు వాయిదా వేశారు.