ప్రభాత ఉదయం, హైదరాబాద్ : నల్లగొండ జిల్లా చింతపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 556, 557, 558, 585లలో గల 18.32 ఎకరాల భూమి వివాదంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దేవాదాయ శాఖకు చెందిన ఆస్తులంటూ కేవలం అధికారుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, లేఖల ఆధారంగా పౌరుల భూముల రిజిస్ట్రేషన్లను ఆపడం చట్టవిరుద్ధమని స్పష్టంచేసింది. ఈ మేరకు దాఖలైన నాలుగు రిట్ పిటిషన్లను అనుమతించిన న్యాయమూర్తి జస్టిస్ రేణుక యారా ఉమ్మడి ఉత్తర్వులు జారీచేశారు.
చరిత్రలోకి తొంగిచూస్తే...
వివాదాస్పద సర్వే నంబర్లలోని భూమి 1345 ఫస్లీ సెత్వార్లో కైరాతి ఇనాం ఆస్తిగా నమోదైంది. ఈ భూములకు సంబంధించి 1976 సంవత్సరంలోనే రెవెన్యూ డివిజనల్ అధికారి ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ జారీచేశారు. కాలక్రమేణా వారసత్వంగా హక్కులు బదిలీ కాగా, రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఎక్కడంతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లను యజమానులు పొందారు. అనంతరం 2009లో ఆర్డీవో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ క్రమంలో 2013లో కొనుగోలుదారుల నుంచి ప్రస్తుత పిటిషనర్లు ఈ ఆస్తులను దక్కించుకున్నారు.
అధికారుల అడ్డంకులు.. బాధితుల పోరాటం
సర్వే నంబర్లు 556, 557, 558, 585లలోని భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయన్న కారణంతో సబ్ రిజిస్ట్రార్ సేల్ డీడ్ల నమోదుకు నిరాకరించారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్‌ను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూములు గట్టుపతి వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందినవని, నిజాం కాలంలో నిత్య ధూపదీప నైవేద్యాల కోసం మంజూరయ్యాయని దేవాదాయ శాఖ వాదించింది. ఆలయానికి చెందిన 181 ఎకరాలలో ఇవి కూడా భాగమని, ఓఆర్సీలు తప్పుడు సమాచారంతో జారీ అయ్యాయని ఆరోపించింది. "దేవాదాయ శాఖకు ఈ భూములపై హక్కులు ఉన్నాయని భావిస్తే, సంబంధిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి నిరూపించుకోవాలి." — హైకోర్టు స్పష్టీకరణ
కోర్టు పరిశీలన.. కీలక తీర్పు
పిటిషనర్లు సమర్పించిన సెత్వార్, పహాణీలు, ఓఆర్సీ, ఎన్ఓసీ, పట్టాదారు పాస్‌పుస్తకాలు తదితర పత్రాలను న్యాయమూర్తి పరిశీలించారు. రికార్డులన్నీ వ్యక్తుల పేర్లపై ఉన్నట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఏ నిబంధనల ప్రకారం, భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటే కచ్చితంగా గెజిట్ నోటిఫికేషన్ ఉండాలని గుర్తుచేశారు. గెజిట్ లేకుండా దేవాదాయ శాఖ లేఖల ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లను తిరస్కరించడం చెల్లదని తేల్చిచెప్పారు. సబ్ రిజిస్ట్రార్ 2013 మార్చి 28న జారీచేసిన నాలుగు తిరస్కరణ ఉత్తర్వులతో పాటు, జిల్లా రిజిస్ట్రార్ 2015 మే 29న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. చట్టబద్ధమైన ఇతర అర్హతలు పరిశీలించి, పిటిషనర్లకు అనుకూలంగా ఉన్న సేల్ డీడ్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేసి విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.