ప్రభాత ఉదయం, హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను రిలీవ్ చేయాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై హైకోర్టు స్టే కొనసాగించింది. అయితే వివాదాస్పద ఆస్తి స్వాధీనానికి సంబంధించి గతంలో ఇచ్చిన యథాతథస్థితి ఉత్తర్వులను ఎత్తివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ రేణుకా యారా ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట భూవివాదంలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ధిక్కార కేసుపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి హైడ్రా కమిషనర్‌ను ఆ పోస్టు నుంచి రిలీవ్ చేయాలని ఆదేశిస్తూ జులై 27న ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన కాంటెంప్ట్ అప్పీళ్లపై విచారణ సందర్భంగా సెప్టెంబర్ 1న మరో ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో హైడ్రా కమిషనర్‌ను రిలీవ్ చేయాలన్న ఆదేశాల అమలును నిలిపివేసింది. అలాగే వివాదాస్పద ఆస్తి స్వాధీనంలో జోక్యం చేసుకోవద్దని అప్పీలుదారును ఆదేశించడంతో పాటు ఆస్తికి సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని పిటిషనర్‌కు సూచించింది. వివాదాస్పద ఆస్తి గుర్తింపుపై అభ్యంతరాలు ఉన్నాయని అప్పీలుదారు తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన సూట్‌లోనే ఆస్తిపై తన యాజమాన్య, స్వాధీన హక్కులను నిరూపించుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్లెయింట్ తిరస్కరణను హైకోర్టు సమర్థించిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 18న కొట్టివేసిందని వివరించారు. తదుపరి విచారణను 2027 జనవరి 20కి వాయిదా వేసింది.