ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన సంస్థలు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ (సీఎస్ఎస్) చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. 2005-06 నుంచి 2014-15 వరకు విద్యుత్ వినియోగానికి సంబంధించి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) జారీ చేసిన డిమాండ్ నోటీసులను సమర్థించింది. వాటిని సవాలు చేస్తూ పలు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు వెలువరించారు. విద్యుత్ సరఫరా చట్టం-1948లోని సెక్షన్ 43(ఎ)(1)(సి) కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు అనుమతులు మంజూరు చేసిన సందర్భాల్లోనే క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. కేవలం ప్రోత్సాహక ఉత్తర్వుల ఆధారంగా ఈ మినహాయింపు కోరడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ప్రోత్సాహక జీవోలు వర్తించవు..
విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 1997లో జీవో 93, 1998లో జీవో 112 జారీ చేసింది. సంప్రదాయేతర ఇంధన వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు ఇతర వినియోగదారులకు విద్యుత్ విక్రయించుకునేందుకు ఈ ఉత్తర్వుల ద్వారా అవకాశం కల్పించింది. అయితే, ఈ జీవోలను కేవలం ప్రోత్సాహక ఉత్తర్వులుగానే పరిగణించాలి తప్ప.. విద్యుత్ సరఫరా చట్టంలోని సెక్షన్ 43(ఎ)(1)(సి) కింద ప్రభుత్వం ఇచ్చిన చట్టబద్ధమైన అనుమతులుగా భావించలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. విద్యుత్ చట్టం-2003 అమల్లోకి వచ్చిన తర్వాత క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో గతంలో ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్ పొందుతున్న వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2005లో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వాటి ప్రయోజనం పొందాలంటే సంబంధిత విద్యుత్ ఉత్పత్తి సంస్థకు అప్పటి చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లుబాటయ్యే అనుమతి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది.
రిట్ పిటిషన్లు కొట్టివేత..
2007లో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టిందని హైకోర్టు పేర్కొంది. అనంతరం వివిధ అంశాలను పరిశీలించినప్పటికీ సంబంధిత ప్రభుత్వ జీవోలను సెక్షన్ 43(ఎ)(1)(సి) కింద చెల్లుబాటయ్యే అనుమతులుగా ప్రకటించలేదని తెలిపింది. పిటిషనర్లు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ చెల్లింపు నుంచి మినహాయింపు కోరలేరని తేల్చిచెప్పింది. దీంతో ఎస్పీడీసీఎల్ జారీ చేసిన డిమాండ్ నోటీసులను రద్దు చేయాలంటూ దాఖలైన పలు రిట్ పిటిషన్లను కొట్టివేసింది. ప్రస్తుతం మరికొన్ని పిటిషన్లు కూడా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
బకాయిలు చెల్లించాల్సిన సంస్థలు
సంస్థ బకాయిలు (రూ.)
డాల్ఫిన్ హోటల్స్ 3,85,02,564
మార్గదర్శి 81,12,110
ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ 64,69,739
ఎల్వీ ప్రసాద్ నేత్రాలయ 1,57,84,982
గ్రీన్ పార్క్ హోటల్స్ 2,23,94,164
మైహోం టైకూన్ 1,04,03,980
టాటా టెలీ సర్వీస్ 7,65,17,351
యునిమెడ్ హెల్త్‌కేర్ 62,32,390
ఝాన్సీలక్ష్మీ భాయ్ (ఆర్ఎస్బీ) 35,13,090
హోటల్ కమల్ (పి) 1,73,46,422
డా. రెడ్డీస్ లేబొరేటరీస్ 1,20,74,983
శ్రీనివాస రీసార్ట్స్ 4,15,44,013
కిమ్స్ లిమిటెడ్ 1,56,97,690
అపోలో హాస్పిటల్స్ 10,53,72,551
యశోద హెల్త్‌కేర్ 3,00,28,535
మైహోం ఎస్టేట్స్ 1,94,22,787
మహేశ్వరీ ఆయిల్ 35,83,774
సాయి బోడా హోటల్ 22,26,473