తెలంగాణ హైకోర్టు 
తెలంగాణ

‘పుల్లారెడ్డి స్వీట్స్‌’ లైసెన్స్‌ పునరుద్ధరించలేం: తెలంగాణ హైకోర్టు

సనత్‌నగర్‌లోని ‘పుల్లారెడ్డి స్వీట్స్‌’ లైసెన్స్ సస్పెన్షన్ ఎత్తివేతకు హైకోర్టు నిరాకరించింది. తయారీ కేంద్రం అపరిశుభ్రంగా ఉంటే అనుమతులు ఎలా ఇస్తామని ప్రశ్నించింది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌ : ‘పుల్లారెడ్డి స్వీట్స్‌’ లైసెన్స్‌ పునరుద్ధరణకు ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్ 27న తెలంగాణ స్టాండర్డ్స్‌ అథారిటీ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ (టీజీ-సేఫ్‌) అధికారులు సనత్‌నగర్‌లోని పుల్లారెడ్డి స్వీట్స్‌ తనిఖీ చేసి లైసెన్స్ సస్పెండ్ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌చేస్తూ సంస్థ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు స్వీట్‌ తయారీ కేంద్రాన్ని ఇటీవల మరోసారి తనిఖీచేసి నివేదిక సమర్పించారు. తయారీ కేంద్రం అపరిశుభ్రంగా ఉందని గుర్తించారు. బొద్దింకలు సంచరిస్తున్నాయని, కోవా తయారీ విభాగంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని గుర్తించారు. స్వీట్ల తయారీకి ఉపయోగించే పాత్రలు అపరిశుభ్రంగా ఉన్నాయని నివేదికలో వెల్లడించారు.
కాగా ఈ లోపాలను చాలావరకు సరిచేశామని, పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదిస్తూ.. కొన్ని లోపాలే ఉన్నాయని భావించి లైసెన్స్‌ పునరుద్ధరిస్తే ఇదే తరహాలో మరికొందరు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందని వాదించారు. ఎంపిక చేసిన హోటళ్లు, స్వీట్‌ షాపులపైనే తనిఖీలు నిర్వహిస్తున్నారా? అని న్యాయమూర్తి ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యపరిరక్షణ దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆహార తయారీ కేంద్రాలు, హోటళ్లు, ఇతర సంస్థల్లో విస్తృత తనిఖీలు చేపట్టినట్టు ప్రభుత్వ న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ గౌడ్‌ కోర్టుకు వివరించారు.