తెలంగాణ హైకోర్టు 
తెలంగాణ

అర్హుల వినతులు వినిపించుకోరా..? అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

హిందీ పండిట్ గ్రేడ్‌-2 నియామకాలపై డీఈవోల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : హిందీ పండిట్‌ గ్రేడ్‌-2 నియామకాల వ్యవహారంలో జిల్లా విద్యాశాఖ అధికారుల సిఫార్సులను బుట్టదాఖలు చేయడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అర్హులుగా గుర్తించిన అభ్యర్థుల వినతులను పరిగణనలోకి తీసుకోకుండా తిరస్కరించడం తగదని పేర్కొంది. కోర్టు ముందు ఒక విధంగా వాదనలు వినిపించి, ప్రభుత్వ నిర్ణయంలో మరో విధంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించింది. ముందే నిర్ణయించుకుని యాంత్రికంగా వ్యవహరించారంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. బోధన్‌కు చెందిన కే.సంధ్య సహా పలువురు దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతంలో డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వం వ్యవహరించలేదని కోర్టు అభిప్రాయపడింది. సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి 20 మంది అభ్యర్థుల కేసులను పరిశీలించి, వారిలో 19 మంది చివరిగా ఎంపికైన అభ్యర్థి కంటే ఎక్కువ మార్కులు సాధించారని నివేదిక ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ సైతం ఈ నివేదికను పరిశీలించి ప్రభుత్వానికి సానుకూల ప్రతిపాదనలు పంపినట్లు ధర్మాసనం గుర్తుచేసింది. అప్పట్లో ఆ సిఫార్సులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా అభ్యర్థులు అర్హులు కారని నిర్ణయించడం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.

ముందొక మాట వెనుకొక మాట

డీఈవోల నివేదికలు, సిఫార్సులు, ఖాళీల వివరాలను పూర్తి స్థాయిలో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అభ్యర్థులను అర్హులు కారని నిర్ణయించడానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీసింది. కోర్టు ఆదేశాల మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా విచారణకు హాజరయ్యారు. 2008, జూలై 22 నాటి డీఈఓ సిఫారసులతో పాటు అభ్యర్థుల వినతులు, తాజా నివేదికలు, జిల్లాల వారీగా ఖాళీలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి రికార్డులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణలో ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. హిందీ పండిట్‌ గ్రేడ్‌-2 నియామకాల తదుపరి విచారణను నవంబర్‌ 23కు వాయిదా వేసింది.