తెలంగాణ హైకోర్టు 
తెలంగాణ

బార్ల స్పెషల్‌ ఫీజుకు బ్రేక్

ప్రభుత్వం జారీ చేసిన జీవో, సర్క్యులర్‌ ఆధారంగా పిటిషనర్ల నుంచి అదనపు ఫీజు వసూలు చేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌: రాష్ట్రంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి స్పెషల్‌ ప్రివిలేజ్‌ ఫీజు వసూలు చేయడాన్ని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫీజు వసూలుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో, సర్క్యులర్‌ ఆధారంగా పిటిషనర్ల నుంచి ఎలాంటి మొత్తాలు వసూలు చేయరాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. స్పెషల్‌ ప్రివిలేజ్‌ ఫీజు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 22న సర్క్యులర్‌ జారీ చేసింది. దీన్ని సవాల్​ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 114 బార్​ అండ్​ రెస్టారెంట్ల ఓనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది పి. విశ్వవర్ధన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. లైసెన్స్‌ రెన్యూవల్‌ ఫీజు చెల్లించిన 19 రోజులకే అదనంగా ఫీజు విధించడం సమంజసం కాదని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. స్పెషల్‌ ప్రివిలేజ్‌ ఫీజు వసూళ్లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫీజు విధింపునకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.