తెలంగాణ హై కోర్టు 
తెలంగాణ

పిల్లలు ఉన్నారని నేర శిక్ష నుంచి తప్పించుకోలేరు : హైకోర్టు

ఆదిలాబాద్​లో భర్తను హత్య చేసిన భార్య లక్ష్మి జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. పిల్లలు ఉన్నారనే సాకుతో నేర శిక్ష నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : పిల్లలున్నంత మాత్రాన సానుభూతితో శిక్ష నుంచి తప్పించుకోలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. భర్తను హత్య చేసిన కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన జీవిత ఖైదును సమర్థించింది. నిందితురాలు దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్‌ను జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ కే సుజనతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. కేసు వివరాలు ఇవీ.. ఆదిలాబాద్‌కు చెందిన అగుర్ల కొమురయ్య మద్యం మత్తులో నిత్యం భార్య లక్ష్మిఅలియాస్ గౌరిని తరచూ వేధించేవాడు. 2016 జనవరి 18న రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి నిద్రపోతుండగా భార్య లక్ష్మితాడుతో గొంతు బిగించి హత్య చేసింది. అధికంగా మద్యం తాగి చనిపోయాడని బంధువులు, ఇరుగుపొరుగువారిని నమ్మించింది.  మరుసటి రోజు ఉదయం మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడ చుట్టూ గొంతు నులిమిన ఆనవాళ్లను బంధువులు గుర్తించారు. లక్ష్మిని ప్రశ్నించగా తానే గొంతు నులిమి చంపినట్లు అంగీకరించింది. ఆదిలాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలిని 2018 నవంబర్ 26న ఆదిలాబాద్ ప్రిన్సిపల్ కోర్టులో ప్రవేశపెట్టగా సెషన్స్ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధించింది.

బెయిల్ బాండ్ల రద్దు

జీవిత ఖైదు తీర్పును సవాల్‌ చేస్తూ లక్ష్మి హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. తనకు 9, 3 ఏళ్ల పిల్లలతో పాటు, మరణించిన సోదరి ఏడాది కుమారుడు కూడా తనపైనే ఆధారపడి ఉన్నారని, శిక్షను తగ్గించాలని వేడుకున్నారు. ఈ వాదనను సోమవారం హైకోర్టు పరిశీలించింది. పిల్లలున్నారని సాకు చూపి శిక్ష నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది. నేరం జరిగిన తీరును పరిగణనలోకి తీసుకొని ట్రయల్ కోర్టు ఇప్పటికే ఈ అంశాన్ని తోసిపుచ్చిందని గుర్తుచేస్తూ ఆ శిక్షను ఖరారు చేసింది. 2026 జూన్ 1 నాటి జీవో ఎంఎస్ నంబర్ 54 ద్వారా ఆమెకు రెమిషన్ మంజూరైనందున బెయిల్ బాండ్లను రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.