Telangana IAS Officer Sridevasena 
తెలంగాణ

శ్రీదేవసేన లాంగ్‌ లీవ్‌.. 22ఏ భూముల విచారణ కమిటీ బాధ్యతలు ఎవరికి?

రాష్ట్ర విద్యాశాఖ ఇన్​చార్జి కార్యదర్శి​ శ్రీదేవసేన లాంగ్​ లీవ్​ పెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి డిసెంబర్ 5 వరకు ఆమె సెలవులో వెళ్తున్నట్లు సమాచారం.

Boddupalli Naresh

ప్రభాత ఉదయం, హైదరాబాద్:

కమిషనర్​ ఆఫ్​ కాలేజీయేట్​ ఎడ్యుకేషన్, రాష్ట్ర విద్యాశాఖ ఇన్​చార్జి కార్యదర్శి​ శ్రీదేవసేన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి డిసెంబర్‌ 5 వరకు ఆమె సెలవులో ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె నిర్వహిస్తున్న బాధ్యతలను విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగితా రాణా పర్యవేక్షించనున్నారు. అయితే, ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన సెక్షన్‌ 22ఏ భూముల వ్యవహారంపై విచారణకు శ్రీదేవసేన నేతృత్వంలోనే ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆమె సెలవుపై వెళ్తున్న నేపథ్యంలో ఈ కమిటీకి తదుపరి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

సెలవుపై ఉద్యోగవర్గాల్లో చర్చ

శ్రీదేవసేన దీర్ఘకాలిక సెలవు తీసుకోవడంపై ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆమె సెలవు వెనుక వ్యక్తిగత కారణాలున్నాయా? రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై చర్చించుకుంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో సంచలనంగా మారిన సెక్షన్ 22ఏ భూముల వ్యవహారం.. భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శ్రీదేవసేన నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా తెలంగాణ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల విభాగం ఐజీ రాజీవ్ గాంధీ హన్మంతు, జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉన్నారు. ఈ కమిటీ 22ఏ భూములకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదమైన సుమారు 16 ప్రధాన భూ సంబంధ అంశాలు, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు, సాంకేతిక అంశాలపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.

పలు కీలక శాఖల బాధ్యతలు

ప్రస్తుతం శ్రీదేవసేన కమిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌తో పాటు ఉన్నత విద్యాశాఖ ఇన్‌చార్జి కార్యదర్శి, కమిషనర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి ఛైర్‌పర్సన్‌ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అదనపు బాధ్యతలతో ఉన్న ఆమెకు భూ వ్యవహారాల విచారణ కమిటీ బాధ్యతలు కూడా అప్పగించడంతో పని ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె సెలవుపై వెళ్తుండటంతో భూ విచారణ కమిటీకి కొత్తగా ఎవరూ నేతృత్వం వహహిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.