ప్రభాత ఉదయం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ముమ్ముర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే చీరలను జిల్లాలకు తరలించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలకు చేరిన 30 లక్షల చీరలు
ఇప్పటి వరకు రాష్టంలోని 33 జిల్లాలకు 30 లక్షల చీరలను అధికారులు తరలించారు. డీఆర్డీవో, సెర్ప్ ఆధీనంలో వాటిని భద్రపరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 57.80 లక్షల చీరలు అవసరం కాగా, ఇప్పటి వరకు 30 లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయి. మరో 27 లక్షలు ప్రాసెసింగ్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన చీరల క్లాత్‌ను పూర్తి స్థాయి డిజైన్ కోసం హైదరాబాద్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి టెస్కో ఆధ్వర్యంలో జిల్లాలకు తరలిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న వీఏవోలు రేషన్‌కార్డు ఆధారంగా చీరలు పంపిణీ చేసి సెర్ప్ యాప్‌లో చీరలను అందుకొన్న మహిళల ఫోటోలను అప్‌లోడ్ చేస్తారు.
ఆకర్షణీయంగా చిలుకపచ్చ రంగు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళకు రెండేసి చీరలు ఇస్తానని ప్రకటించిన విషయం విదితమే. ఇప్పటికే మొదటి చీర లేత నీలం, ముదురు నీలం రంగు అంచుతో ఆకర్షణీయంగా ఉండగా, రెండో చీరను ముదురు ఎరుపు రంగు అంచుతో చిలుకపచ్చ రంగు ఉండేలా తయారు చేయించారు. ప్రభుత్వం చిలుకపచ్చ చీరను నవంబర్ 19న మహిళలకు అందివ్వనుంది.