తెలంగాణ

చైర్పర్సన్ లేకుండానే మీటింగులు

తెలంగాణలో భూ అక్రమాల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ చైర్‌పర్సన్ లేకుండానే సమావేశాలు నిర్వహిస్తుండటంతో నిర్ణయాల చెల్లుబాటుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : రాష్ట్రంలో భూములకు సంబంధించి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమావేశాలు చైర్​పర్సన్​ లేకుండానే జరుగుతున్నాయి. సెప్టెంబర్​ 16న అసెంబ్లీలో సెక్షన్​ 22ఏ భూములపై జరిగిన చర్చలో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల దుర్వినియోగంపై పలు అంశాలను లేవనెత్తారు. విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ సెప్టెంబర్​ 24న సీఎస్​ సంజయ్​ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. 22ఏ భూములకే పరిమితం చేయకుండా, 16 ప్రధాన అంశాలను ఈ కమిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. చైర్​పర్సన్​ సమక్షంలో సమావేశాలు నిర్వహించి, తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. అలా జరగని పక్షంలో కమిటీ నివేదికపై బాధితులు కోర్టుల్లో సవాల్​ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

వివాదాస్పద భూములపై విచారణకు కమిటీ

అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే సాంకేతిక విద్యా కమిషనర్​ ఏ శ్రీదేవసేన చైర్​పర్సన్​గా కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో నంబర్​ 134ను ప్రభుత్వం జారీ చేసింది. కన్వీనర్​గా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్​ గాంధీ హనుమంతు ఉన్నారు. జనగామ కలెక్టర్​ సందీప్​ కుమార్​ ఝా తో పాటు 6 జిల్లాల కలెక్టర్లను సభ్యులుగా నియమించారు. వివిధ జిల్లాల్లో జరిగిన భూ అక్రమాలు, చట్టాలు, నిబంధనలు, ఉల్లంఘనలపై కమిటీ లోతుగా అధ్యయనం చేసి బాధ్యులను తేల్చనుంది. ఆ తరువాత తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నది. కమిటీకి జిల్లా కలెక్టర్ల నుంచి అవసరమైన రికార్డులు, వివరాలు కోరే అధికారం కల్పించారు. ఏయే అంశాలపై విచారణ చేయాలనే దానిపై జీవోలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

విచారణ చేపట్టాల్సిన భూములివే..

  • మాజీ సీఎం కేసీఆర్, ఆయన అనుచరులకు చెందిన ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, మర్కుక్​ భూములు

  • మాజీ మంత్రి టి హరీశ్​రావుకు చెందిన రామంచ, రంగారెడ్డి జిల్లా అజీజ్​నగర్​లోని భూములు, అనుచరులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులపై

  • రంగారెడ్డి జిల్లా జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్​ కుటుంబ సభ్యులు, అనుచరులు కొనుగోలు చేసిన భూములు

  • మొయినాబాద్ మండలంలో మాజీ ఎమ్మెల్వే పైలట్​ రోహిత్​ రెడ్డి అసైన్డ్​ భూములు, సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్​ రిజర్వాయర్​ భూ సేకరణలో అక్రమాలు, రంగనాయక సాగర్​ సమీపంలో భూముల కొనుగోళ్లు

  • శంషాబాద్​ మండలం బహదూర్​ గూడలో మాజీ మంత్రి గంగుల కమలాకర్​ ఆక్రమించిన ప్రభుత్వ భూములు, మిడ్​ మానేర్​ రిజర్వాయర్​లో నిర్వాసితులకు పరిహారం, ఆర్అండ్ఆర్​ ప్యాకేజీలో జోగినపల్లి రవీందర్​రావు, సౌమ్య అనుచిత లబ్ధి, వట్టి నాగులపల్లిలో బీఆర్ఎస్​ ఎంఎల్​ఏ పల్లా వెంకట్​ రెడ్డి భూములు, శేరిలింగంపల్లి మండలంలోని శంకర హిల్స్​లో మాజీ మంత్రి గంగుల కమలాకర్​ కొనుగోలు చేసిన భూములు, సికింద్రాబాద్​ జిర్రాలోని మాజీ ఎమ్మెల్సీ ఎల్విన్​ స్టీఫెన్​ సన్​ లీజు భూమి క్రమబద్దీకరణ

  • ధరణి వెబ్​ పోర్టల్​ దుర్వినియోగం, భూదాన్​, సీలింగ్​, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసైన్డ్​, ప్రభుత్వ భూముల మార్పిడి, మహబూబ్​నగర్​ జిల్లా గండీడ్​లో పలు సంస్థల అక్రమ వ్యవహారాలు, ఇనాం భూములు

ఎందుకొచ్చిన సమస్య అంటూ సెలవుపై వెళ్లారా?

కమిటీ చైర్​పర్సన్​గా ఉన్న శ్రీదేవసేన ఎవరూ ఊహించని విధంగా దీర్ఘకాలిక సెలవు పెట్టడం అధికారవర్గాల్లో సంచలనం కలిగించింది. బీఆర్ఎస్​కు చెందిన ముఖ్య నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావుతో పాటు మాజీ మంత్రుల భూముల కొనుగోళ్లు, విక్రయాలు, అక్రమాలపై విచారణ జరపాల్సి రావడం ఆమెను ఆలోచనలో పడేసిందంటున్నారు. ఇదే కాకుండా భూదాన్, ఇనాం, అసైన్డ్​, సీలింగ్ భూములు పెద్ద ఎత్తున చేతులు మారగా, వ్యక్తిగత అవసరాలు, అత్యవసర పరిస్థితుల్లో లబ్ధిదారులు విక్రయించడంతో బడా బాబులు వాటిని కొనుగోలు చేశారు. భూముల ధరలు అధికంగా పలుకుతున్న జిల్లాల్లో ఈ కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి. వీటన్నింటినీ విచారించి నివేదిక రూపొందించాల్సిన బాధ్యత తనపై ఉండటంతో శ్రీదేవసేన పునరాలోచనలో పడినట్లు సచివాలయంలో చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో కెరీర్​ పరంగా అనేక చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆమె ముందుగానే పసిగట్టారని అంటున్నారు. మధ్యేమార్గంగా దీర్ఘకాలికంగా సెలవులో వెళ్లడం మినహా మరో మార్గం ఆమె ముందు లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. అక్టోబర్​ 14 నుంచి డిసెంబర్​ 4 వరకు 50 రోజులు సెలవు పెట్టి ఆమె అమెరికాకు వెళ్లారు. డిసెంబర్​ 4 తరువాత విధుల్లో చేరతారా? సెలవు పొడిగించుకుంటారా? అనేది తెలియడం లేదు. తన స్థానంలో మరో ఐఏఎస్​ను చైర్​పర్సన్​గా నియమిస్తే విధుల్లో జాయిన్​ కావొచ్చని, ఎవరినీ నియమించకపోతే మరిన్ని రోజులు సెలవు పొడిగించుకునే అవకాశం ఉందని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు.

చైర్​పర్సన్​ లేకుండానే కమిటీ భేటీలు

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం చైర్​పర్సన్​ సమక్షంలో కమిటీ సమీక్షలు, సమావేశాలు జరగాల్సి ఉంటుంది. చైర్​పర్సన్​ సమక్షంలో జరిగే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎజెండాలో చేర్చి తీర్మానం చేయాలి. టర్మ్స్​​ ఆఫ్​ రిఫరెన్స్​ ప్రకారం సమావేశాలు జరగాల్సి ఉంటుందని, ఏమాత్రం తేడా వచ్చినా అసలుకే మోసం వస్తుందనే వాదన అధికారవర్గాల్లో వినిపిస్తోంది. చైర్​పర్సన్​ శ్రీదేవసేన సెలవులో ఉండటంతో మిగతా సభ్యులు క్రమం తప్పకుండా సమావేశమవుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఇలా తీసుకొనే నిర్ణయాలు, తీర్మానాలు, విచారణ అంశాలు న్యాయపరంగా నిలబడతాయా? అనేది భవిష్యత్తులో తేలనుంది. నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలకు ఆదేశిస్తే బాధితులు కోర్టులో సవాల్​ చేసే అవకాశం ఉందని అంటున్నారు. చైర్​పర్సన్​ లేకుండా కమిటీ సభ్యులు నిర్ణయాలు తీసుకున్నారని, ఇవి చెల్లవని సవాల్​ చేసే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.