ప్రభుత్వ భూముల వేలం 
తెలంగాణ

రూ. 10 వేల కోట్ల అదనపు ఆదాయమే టార్గెట్ : ప్రభుత్వ భూముల విక్రయానికి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం

రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచేందుకు ప్రభుత్వ భూముల వేలం, లేఔట్ల అభివృద్ధి ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ ​: ఆర్థిక వనరుల లోటును భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కారు రియల్​ ఎస్టేట్​ బాట పట్టింది. ఇందుకోసం ప్రభుత్వ భూముల అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ.10 వేల కోట్ల నిధులను రాబట్టుకునేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని సంకల్పించింది. అందులో భాగంగానే ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం వశమైన 550 ఎకరాల మియాపూర్ భూములను వేలంలో అమ్మకానికి పెట్టాలని, బహిరంగ మార్కెట్ విలువ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు రచించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అలాగే, ఖరీదైన ప్రభుత్వ భూముల్లో లేఔట్లు వేయాలని ఏకంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలోనే నిర్ణయించింది. ఇండస్ట్రియల్​ కారిడార్లు, పట్టణాభివృద్ధి విభాగాల్లో నిరుపయోగంగా మిగిలిపోయిన భూములు, కబ్జాల చెర నుంచి విడిపించిన స్థలాలతోపాటు అనేక విభాగాల్లో నిరర్ధకంగా మిగిలిపోయిన ఆస్తులను అమ్మకానికి పెట్టబోతున్నది. ఈ మేరకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సెక్రటేరియెట్​లో నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. నిధుల సమీకరణకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆర్థిక, రెవెన్యూ, పరిశ్రమలు, టీజీఐఐసీ, పట్టణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులను భట్టి ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక వనరులను బలోపేతం చేయడంతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు, పారిశ్రామిక లేఔట్లు, ల్యాండ్ పూలింగ్, భూముల వేలం ద్వారా ఆదాయ సమీకరణకు ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఈ ప్రక్రియలో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణపైనా రివ్యూ నిర్వహించారు. అజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేటలాంటి పారిశ్రామిక ప్రాంతాల్లో యూనిట్లవారీగా భూముల క్రమబద్ధీకరణ, అనుమతుల ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. బీ-కేటగిరీ, సూక్ష్మ పారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించాలని, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించడంతోపాటు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.  

 భూసేకరణకు ముందస్తు వ్యూహం

హైదరాబాద్ పరిసరాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్, భవిష్యత్ అవసరాలకు భూముల లభ్యత, భూ వనరుల సమీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విస్తృతంగా చర్చించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన భూములను ముందుగానే గుర్తించాలని అధికారులకు సూచించారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో పాల్గొనే అన్ని వర్గాలకు స్పష్టతతోపాటు ప్రయోజనం కలిగేలా ప్రణాళికాబద్ధమైన, పారదర్శకమైన విధానాన్ని రూపొందించాలన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి సమకూరే భూ వనరులను అభివృద్ధి ప్రాధాన్యతలకు తగ్గట్టుగా వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని, అదనపు ఆదాయం సమకూర్చే మార్గాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల వినియోగంలో ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి అవసరాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని భట్టి స్పష్టం చేశారు. అసైన్డ్ భూములకు సంబంధించిన అంశాలను చట్టపరమైన నిబంధనలు, ప్రజా ప్రయోజనాలకు తగ్గట్టుగా సమగ్రంగా పరిశీలించి, తగిన ప్రతిపాదనలను మంత్రివర్గ పరిశీలనకు సమర్పించాలని సూచించారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ పరిధిలోని భూముల అభివృద్ధి, వేలం ద్వారా ఆదాయ సమీకరణకు ఉన్న అవకాశాలను కూడా ఆయన సమీక్షించారు. వేలానికి అనువైన లేఔట్లను గుర్తించాలని, ప్రధాన రహదారులకు మెరుగైన అనుసంధానం, అభివృద్ధికి అవకాశాలు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భూముల వేలం ప్రక్రియను దశలవారీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  

 ప్రభుత్వ భూముల్లో లేఔట్లు

ప్రభుత్వ భూములు, లేఔట్ల అభివృద్ధి, వేలం సంబంధిత కార్యకలాపాలను సమర్థంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక డిజిటల్ డ్యాష్‌బోర్డ్ రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. ఈ డ్యాష్‌బోర్డ్ ద్వారా శాఖల మధ్య సమన్వయం మెరుగుపడటంతోపాటు నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు అవకాశం ఉంటుందని, భూముల వేలం ప్రక్రియలో పారదర్శకత మరింత పెరుగుతుందని తెలిపారు. ‎ప్రభుత్వ ఆస్తుల విలువను పెంచడం, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించడం, ఆదాయ సమీకరణకు కొత్త మార్గాలను గుర్తించడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో అన్ని శాఖల అధికారులు  పనిచేయాలని పిలుపునిచ్చారు.