కరీంనగర్, వనపర్తి వ్యవసాయ డిగ్రీ గురుకుల కళాశాలల్లో రెండేళ్లుగా నిలిచిన ప్రవేశాలు 
తెలంగాణ

బాలికలకు దూరమైన అగ్రికల్చర్ విద్య

కరీంనగర్, వనపర్తి వ్యవసాయ డిగ్రీ గురుకుల కళాశాలల్లో రెండేళ్లుగా అడ్మిషన్లు నిలిచిపోవడంతో 480 మంది బీసీ బాలికలు అవకాశాలు కోల్పోయారు.

Phaneendra

ప్రభాత ఉదయం, కరీంనగర్ :  రాష్ట్రంలోని కరీంనగర్, వనపర్తి వ్యవసాయ డిగ్రీ గురుకుల కళాశాలల్లో వరుసగా రెండో ఏడాది కూడా అడ్మిషన్లు నిలిచిపోవడంతో వెనుకబడిన వర్గాల బాలికలు ఉన్నత విద్యకు దూరం కావాల్సిన దుస్థితి నెలకొంది. రెండేళ్లుగా 480 మంది విద్యార్థినులు బీఎస్సీ అగ్రికల్చర్ విద్యను పొందలేక తీవ్రంగా నష్టపోయారు.  ఆడ్మిషన్లు ఆగిపోవడానికి ఆ కళాశాలలకు ఐసీఏఆర్‌ గుర్తింపు లభించకపోవడమే కారణమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఆ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే గ్రామీణ, పేద, మధ్యతరగతి బీసీ కుటుంబాల బాలికలకు ఈ కళాశాలలు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. అలాంటి విద్యాసంస్థల్లో రెండేళ్లుగా ప్రవేశాలు లేకపోవడం విద్యార్థినుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది.

2022-23లో కళాశాలల ఏర్పాటు

మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో 2022-23 విద్యా సంవత్సరంలో బాలికల కోసం కరీంనగర్‌, వనపర్తిలో రెండు వ్యవసాయ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాలల్లో  ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తింపుతో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సును ప్రవేశపెట్టారు. ఒక్కో కళాశాలలో 120 సీట్ల చొప్పున మొత్తం 240 మంది బాలికలకు ఏటా ప్రవేశాలు కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఇంటర్మీడియట్‌ బైపీసీ పూర్తి చేసిన బాలికలకు వీటిలో తెలంగాణ ఎప్‌సెట్‌ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయిస్తారు. రెండు కళాశాలల్లోనూ 2024-25 విద్యా సంవత్సరం వరకు అడ్మిషన్లు కొనసాగాయి.

రెండేళ్లుగా నిలిచిన ప్రవేశాలు

2024-25 వరకు సజావుగా సాగిన ప్రవేశాల ప్రక్రియ ఆ తర్వాత నిలిచిపోయింది. 2025-26 విద్యా సంవత్సరంలో కొత్తగా అడ్మిషన్లు చేపట్టలేదు. తాజాగా 2026-27 విద్యా సంవత్సరంలోనూ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో వ్యవసాయ విద్యను అభ్యసించాలనుకునే బాలికలకు నిరాశ ఎదురవుతోంది. రెండు కళాశాలల్లో కలిపి ఏటా 240 మంది చొప్పున రెండేళ్లలో 480 మందికి అవకాశం లభించాల్సి ఉండగా, ఆ సీట్లన్నీ భర్తీ కాకుండా వృథా అయిపోయాయి. ప్రవేశాలు నిలిచి పోవడంతో అర్హులైన బీసీ బాలికలకు ఉచిత ఉన్నత విద్యాభ్యాసం లేక, వారు ప్రైవేట్ విద్యాసంస్థలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఐసీఏఆర్‌ గుర్తింపునే అసలు సమస్యనా?

వ్యవసాయ విద్యకు సంబంధించి జాతీయ స్థాయిలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌) గుర్తింపు అంశం ఈ కళాశాలల ప్రవేశాలకు అడ్డంకిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. అడ్మిషన్ల నిలిపివేతకు ఐసీఏఆర్‌ గుర్తింపు లేకపోవడమేనా? లేక ఇతర పరిపాలనాపరమైన, విద్యాపరమైన కారణాలు ఉన్నాయా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఐసీఏఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతి సబ్జెక్టుకు అర్హత కలిగిన పూర్తిస్థాయి ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఉండాలి. ప్రస్తుతం ఈ కాలేజీలలో చాలా వరకు ఒప్పంద (కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్) సిబ్బందితో నడుస్తున్నాయి. అలాగే సొంత భవనాలు, ప్రయోగాలకు కావాల్సిన అధునాతన ల్యాబ్‌లు, సాగు భూములు అవసరం. ఈ నేపథ్యంలో ఐసీఏఆర్ గుర్తింపులో అవరోధం నెలకొందన్న ప్రచారం వినిపిస్తున్నది. బాలికలు నష్టపోకుండా  కళాశాలలకు అవసరమైన గుర్తింపులు, అనుమతుల సమస్యలను ప్రభుత్వం, యూనివర్సిటీ యాజమాన్యం పరిష్కరించి తిరిగి ప్రవేశాలు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.