తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళా ప్రయాణికులు. 
తెలంగాణ

పేద మహిళలకు వరంగా ‘మహాలక్ష్మి’

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించింది. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళల ఒక్కో ప్రయాణానికి అయ్యే సగటు ఖర్చు 68.1 శాతం తగ్గినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌ : తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించింది. దాంతోపాటు వారి ప్రయాణ అలవాట్లలోనూ మార్పు తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహాలక్ష్మి 2023 డిసెంబర్‌లో ప్రారంభించిన పథకం ద్వారా మహిళల ప్రయాణ సౌకర్యాలు, జీవన ప్రమాణాలలో వచ్చిన మార్పులపై అధ్యయనం జరిగింది. విజయవాడ, న్యూఢిల్లీ స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌కు చెందిన పరిశోధకులు 'ఎక్స్‌ప్లోరింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఉమెన్స్ ఫ్రీ బస్ సర్వీసెస్ ఆన్ ఉమెన్స్ మొబిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్' పేరుతో సంయుక్తంగా సర్వే చేపట్టారు. ఈ అధ్యయనంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 410 మంది మహిళల నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన వివరాలు సేకరించారు. వివరాలు ‘సస్టెయినబుల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ లైవబిలిటీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

భారీగా తగ్గిన ప్రయాణ ఖర్చు

మహాలక్ష్మి పథకం మంచి ఫలితాలను అందిస్తున్నట్లు తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళల ఒక్కో ప్రయాణానికి అయ్యే సగటు ఖర్చు 68.1 శాతం తగ్గినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. అదే సమయంలో టీజీఎస్‌ఆర్టీసీ బస్సులపై మహిళలు ఆధారపడటం గణనీయంగా పెరిగింది. పథకం అమలుకు ముందు మహిళలు ఒక్కో ప్రయాణానికి సగటున రూ. 30.4 ఖర్చు చేయగా, ప్రస్తుతం అది రూ. 9.70కు తగ్గింది. గతంలో 43.8 శాతం మంది మహిళలు ప్రధానంగా టీజీఎస్‌ఆర్టీసీ బస్సులను వినియోగించేవారు. ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ సంఖ్య 71.2 శాతానికి పెరిగింది. రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా 5.5 లక్షల నుంచి 17.2 లక్షలకు చేరినట్లు అధ్యయనం పేర్కొంది.

దూరప్రయాణాలలో పెంపు

ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రావడంతో మహిళలు గతంలో కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నారు. సగటు ప్రయాణ దూరం 7.5 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్లకు పెరిగింది. సామాజిక అవసరాల కోసం చేసే ప్రయాణాలు 22.8 శాతం, వైద్య సంబంధిత ప్రయాణాలు 15.5 శాతం అధికమయ్యాయి. ఆదాయ వర్గాల వారీగా పరిశీలిస్తే నెలకు రూ.20 వేలలోపు ఆదాయం కలిగిన కుటుంబాల మహిళలకు ఈ పథకం ద్వారా అత్యధిక ప్రయోజనం లభించినట్టు గుర్తించారు. ప్రయాణ ఖర్చులు సుమారు 73 శాతం తగ్గాయి. రూ.20,001 నుంచి రూ.50 వేల వరకు ఆదాయం ఉన్న కుటుంబాల్లో 69 శాతం, రూ.2 లక్షలకు పైగా ఆదాయం కలిగిన కుటుంబాల్లో 62 శాతం మేర ఖర్చులు తగ్గినట్లు అధ్యయనకర్తలు గుర్తించారు. వయస్సుల వారీగా చూస్తే 20 ఏళ్లలోపు మహిళలు ప్రయాణ దూరం, ప్రయాణాల సంఖ్య పరంగా ఎక్కువ ప్రయోజనం పొందారు. విద్యార్థినులు, అసంఘటిత రంగ కార్మికుల్లో బస్సుల వినియోగం పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది.

విద్య, ఉపాధి, వైద్య అవసరాలకు మహాలక్ష్మి

మహిళలకు ఉచిత ప్రయాణం విషయమే కాకుండా వారి విద్య, ఉపాధి, వైద్య అవసరాలకు మహాలక్ష్మి ఉచిత రవాణా సౌకర్యం ఏ మేరకు దోహదపడుతోందన్న అంశాన్ని కూడా పరిశోధకులు విశ్లేషించారు. విద్యాసంస్థలు ఉండే పరిసరాల్లో విద్యాపరమైన ప్రయోజనాలు ఎక్కువగా కనిపించగా, శివారు ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు చేరువయ్యే విషయంలో సానుకూల మార్పులు నమోదయ్యాయి. బస్సులు, రహదారుల నిర్వహణ బాగున్న ప్రయాణ మార్గాల్లో మహిళల ప్రయాణాలు పెరిగాయని అధ్యయనకర్తలు గుర్తించారు. విద్యార్థులకు రద్దీ సమయాల్లో అదనపు బస్సులు నడపడం, వృద్ధ మహిళలు, గృహిణులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, మహిళా కండక్టర్ల నియామకం, బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకు భద్రతను మరింత పెంచవచ్చని అధ్యయనకర్తలు ప్రభుత్వానికి సూచించారు.