గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టు 
తెలంగాణ

గోదావరి- కావేరి లింకులో తెలంగాణ బైపాస్?

గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టులో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన గోదావరి-కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టులో తెలంగాణను తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న ప్రచారం వినిపిస్తోంది. తెలంగాణతో సంబంధం లేకుండా ఈ ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, ఇది అమలైతే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని, ఈ ప్రతిపాదనలను ఒప్పుకొనేది లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఇచ్చంపల్లి(సమ్మక్క సాగర్) నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు అనుసంధానించి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని వాదిస్తోంది. ఏపీ ప్రతిపాదనలు తెలంగాణ నీటి ప్రయోజనాలకు గండి కొట్టేలా ఉన్నాయని నేషనల్​ వాటర్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ (ఎన్​డబ్ల్యూడీఏ) దృష్టికి తీసుకొచ్చినట్లు రాష్ట్ర ఇరిగేషన్​ అధికారులు తెలిపారు. దీంతోపాటు ఇచ్చంపల్లి నుంచి కావేరికి నీటిని తరలించే మార్గంలో రాష్ట్రంలోని ప్రజల తాగు, సాగునీటి అవసరాలకు ప్రతిపాదించిన 43 టీఎంసీల కేటాయింపులను 74 టీఎంసీలకు పెంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్​డబ్ల్యూడీఏకు లెటర్​ ఇచ్చినట్లు ఇరిగేషన్​ అధికారులు వివరించారు. 

పాత ప్రతిపాదనలతో తెలంగాణకు ప్రయోజనం

కేంద్ర ప్రభుత్వం వద్దనున్న పాత ప్రతిపాదనల ప్రకారం తెలంగాణలో ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ వరకు లింక్​ కెనాల్​ నిర్మించనున్నారు. దీని​ ద్వారా ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని కరువు పీడిత, నీరందని ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది. రాష్ట్ర వాటాగా దక్కే 43 టీఎంసీలతో ఈ జిల్లాల్లో సుమారు 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు మరో 7.12 లక్షల ఎకరాలు పాత ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. దీని ద్వారా వ్యవసాయంతో పాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా జరుగుతుందని ఇరిగేషన్​ అధికారులు ఎన్​డబ్ల్యూడీఏ దృష్టికి తీసుకెళ్లారు. గోదావరి-కావేరీ లింకు ప్రాజెక్టు రూట్ మార్పును రాజకీయ కోణంలో కాకుండా కోట్లాది మంది తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాల్సిన అవసరముందని అధికారులు చెబుతున్నారు.

ఏపీ ప్రతిపాదనలపై తెలంగాణ అభ్యంతరం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్​లో కేంద్రానికి లేఖ రాస్తూ.. ఈ లింక్‌ ప్రాజెక్టును తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి కాకుండా ఏపీలోని పోలవరం- బొల్లాపల్లి- బనకచర్ల మీదుగా చేపట్టాలని ప్రతిపాదించింది. తెలంగాణకు పూర్తిగా నష్టం చేసేలా ఉన్న ఈ ప్రతిపాదనకు తాము ఒప్పుకొనేది లేదని ఎన్​డబ్ల్యూడీఏకు స్పష్టం చేసినట్లు అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టును పోలవరం నుంచి చేపడితే తెలంగాణను తప్పించి నేరుగా ఏపీ, తమిళనాడుకు గోదావరి జలాలు తరలిపోతాయని, దీనివల్ల తెలంగాణకు దక్కాల్సిన 43 టీఎంసీలు నీటిని కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో ఏపీ ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా ఈ ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను అమలుచేస్తే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, న్యాయపోరాటం చేసేందుకు యాక్షన్ ప్లాన్​ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.