ప్రభాత ఉదయం, హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసు విచారణ కీలక మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై రెండు, మూడు రోజుల్లోగా నాంపల్లి కోర్టులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దాఖలు చేయనున్న అదనపు చార్జ్‌షీట్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, నవీన్ రావులను నిందితులుగా చేరుస్తారని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే, ఇందులో ప్రధాన నిందితుడిగా (ఏ1) ఎవరి పేరు ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై గత నెల రోజులుగా సిట్ అధికారులు భారీ కసరత్తు చేస్తున్నారని, న్యాయ నిపుణుల సలహాలనూ తీసుకున్నారని తెలిసింది. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) పరిశీలన తర్వాత పూర్తి ఆధారాలతో నాంపల్లి కోర్టులో అదనపు చార్జ్ షీట్‌ను దాఖలు చేసేందుకు సిట్ రెడీ అయిందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇది దాఖలైన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. దీంతో ఫోరెన్సిక్ నివేదికలను కూడా కోర్టుకు సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం నిందితుల జాబితాలో ఉన్నవారు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అడిషనల్ చార్జ్ షీట్ దాఖలయ్యాక ఆయా నిందితులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని సిట్ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారికి ఎలాంటి అవకాశాల్నీ ఇవ్వని రీతిలో ఈసారి అదనపు చార్జ్ షీట్లో కొత్త నిందితుల పేర్లను పక్కాగా పొందుపర్చినట్లు సమాచారం.
ఏ1, ఏ2 నిందితుల పేర్లు మారుతాయా ?
ఇంతకుముందు పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, సస్పెండె అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్‌రావు, ఒక న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావులపై 68 పేజీల చార్జ్‌షీట్ దాఖలైంది. ప్రస్తుతానికి ఈ కేసులో ఏ1 నిందితుడిగా ప్రభాకర్ రావు, ఏ2 గా ప్రణీత్ రావు ఉన్నారు. అదనపు చార్జ్‌షీట్‌లో ఏ1, ఏ2 నిందితులుగా ఎవరెవరి పేర్లు ఉంటాయనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ‘‘అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశాం” అని సిట్ ఎదుట ప్రభాకర్ రావు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఏ1 నిందితుడి పేరు మారుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.
కఠిన సెక్షన్లతో అదనపు చార్జ్‌షీట్
సాధారణంగా కేసులలో ప్రయోగించే ఐపీసీ సెక్షన్లతో పాటు చట్టవిరుద్ధంగా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛపై నిఘా పెట్టినందుకుగానూ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద సెక్షన్లను జోడిస్తూ అదనపు చార్జ్‌షీట్‌ను సిద్ధం చేశారు. ఐజీ ర్యాంకులో ఉన్న ప్రభాకర్‌రావును కీలక పోస్టులో(ఎస్ఐబీ చీఫ్) కొనసాగించడం, ఆయనకు పదేపదే బీఆర్ఎస్ సర్కారు ఎక్స్‌టెన్షన్ ఇవ్వడాన్ని క్విడ్ ప్రోకోగా సిట్ పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
2018 డిసెంబర్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేయించారని సిట్ ఆరోపించింది. సిద్ధిపేట, ఇతర ఎన్నికలకు సంబంధించి కొన్ని ఫోన్ నంబర్లను ట్యాపింగ్‌కు సిఫార్సు చేశారనే ఆరోపణలతో పలువురు బీఆర్ఎస్ నేతల పేర్లనూ ఇప్పటికే నిందితుల జాబితాలో చేర్చింది. కేసు విచారణలో భాగంగా కేసీఆర్, కేటీఆర్ , హరీశ్ రావు, నవీన్ రావులను ఇప్పటికే సాక్షులుగా విచారించింది. అక్టోబర్ 5న రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డిని సాక్షిగా విచారించి చివరి స్టేట్మెంట్ను సిట్ రికార్డ్ చేసింది. ఇప్పటివరకు 618 మంది సంభాషణల్ని రికార్డు చేసినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలను సేకరించారు. వీటితో ముడిపడిన ఫోరెన్సిక్ ఆధారాలనూ తాము కోర్టుకు సమర్పించామని సిట్ అధికారులు చెబుతున్నారు.