హైదరాబాద్, ప్రభాత ఉదయం: డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపు విషయంలో తలెత్తిన వివాదానికి ప్రభుత్వం తెరదించబోతున్నది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 30 టీఎంసీల నీటిని ఏదుల రిజర్వాయర్ నుంచి కాకుండా శ్రీశైలం జలాశయం నుంచే లిఫ్ట్ చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయబోతున్నారు. గతంలో ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు టెండర్లు జారీ చేశారు. కాగా ఈ నిర్ణయాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలిస్తే ‘పాలమూరు – రంగారెడ్డి’ ఆయకట్టు రైతులు నష్టపోతారని ఆ జిల్లా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గతంలో జారీ చేసిన టెండర్‌ను రద్దుచేసి శ్రీశైలం జలాశయం నుంచి నీటిని లిఫ్ట్ చేసుకొనే విధంగా కొత్త టెండర్ జారీ చేయనున్నారు.
డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలన్న ప్రతిపాదన ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల మధ్య చిచ్చు పెట్టింది. ఈ వివాదంపై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. ‘డిండి ప్రాజెక్టుకు అవసరమైన నీటిని శ్రీశైలం జలాశయం నుంచే తరలించేందుకు డీపీఆర్ సిద్ధం చేశాం. కానీ ఇంజనీరింగ్ అధికారులు తప్పిదం వల్ల ఏదుల నుంచి నీటిని తీసుకోవాలన్న ప్రతిపాదన తెరమీదకు వచ్చింది’ అని పేర్కొన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి.. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జరగబోయే సమీక్షా సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు రూ.1800 కోట్లు ఖర్చు అవుతుందని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. అయితే శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలిస్తే అంచనా వ్యయం భారీగా పెరుగుతుందని వారు చెబుతున్నారు. డిండి ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామాలకు తాగు, సాగు నీటిని అందించనున్నారు. అదే విధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరిన్ పీడిత ప్రాంతాలు, కరువు ప్రాంతాలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలకు సాగునీరు అందనున్నది. ఈ ప్రతిపాదనలో ఎటువంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.