డీజీపీ సీవీ ఆనంద్ 
తెలంగాణ

పోలీసుల ఆరోగ్య భద్రతకే ‘ఫిట్ కాప్’ : డీజీపీ సీవీ ఆనంద్

పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణలో ‘ఫిట్ కాప్’ విధానాన్ని అమలు చేయడానికి పోలీసుశాఖ సిద్ధమవుతోంది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్:  పని ఒత్తిడి వల్ల పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టే సమయం ఉండటం లేదని, వారు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలందించగలరని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ‘ఫిట్ కాప్’ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి పోలీసుశాఖ చర్యలు చేపట్టారు. అందుకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఇతర సంస్థల సహకారం అందిస్తున్నాయి. ఆ ఫౌండేషన్ సభ్యులు, పోలీసు ఉన్నాతాధికారులతో శుక్రవారం డీజీపీ తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం వివరాలు వెల్లడించారు. పోలీసు హెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫైల్ సిస్టమ్‌గా రూపొందించిన ఈ ప్రత్యేక యాప్ ఆధారిత విధానాన్ని రాబోయే 30 నుంచి 45 రోజుల్లోగా అమలులోకి తెచ్చే అవకాశం ఉందన్నారు. దీనిలో ఎనిమిది ప్రధాన ఆరోగ్యం అంశాలకు చెందిన ప్రశ్నలతో పాటు వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 90 వేల మందికిపైగా పోలీసు సిబ్బంది తమ సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. మధుమేహం, రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్, ఇతర ఆరోగ్య సమస్యలు, జీవనశైలి అలవాట్లు, శారీరక శ్రమ, ధూమపానం, మద్యపానం లాంటి అంశాలపై సమాచారం సేకరిస్తారు. ఈ వివరాల ఆధారంగా వారి ఆరోగ్య ప్రమాద స్థాయిని బట్టి కాల్ సెంటర్ ద్వారా సంబంధిత సిబ్బందిని ఫోన్ ద్వారా అప్రమత్తం చేస్తారు. అలాంటి వారికి అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స అందిస్తారని హెల్పింగ్ హేండ్స్ ఫౌండేషన్ అధినేత సల్మాన్ తెలిపారు. ఈ సమావేశంలో సీపీ సజ్జనార్, ఏడీజీ అకున్ సబర్వాల్, ఐజీ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.