తెలంగాణలో వృద్ధ తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై పెరుగుతున్న ఫిర్యాదులు 
తెలంగాణ

నడక నేర్పిన చేతులు.. నడిరోడ్డుపాలు

తెలంగాణలో వృద్ధ తల్లిదండ్రులపై పిల్లల నిర్లక్ష్యం పెరుగుతోంది. ఆస్తులు పంచాక అనాథలుగా మారుస్తున్న ఘటనలపై 2021 నుండి ఇప్పటివరకు 8,594 ఫిర్యాదులు నమోదయ్యాయి.

Phaneendra

కన్నీళ్లతో కడుపునింపుకుని, కంటికి రెప్పలా కాపాడుకుని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఆదరణ లేకుండా పోతున్నది. ప్రయోజకులైన కొడుకులు, బిడ్డలే కన్నవారిని భారమని అనుకుంటున్నారు. నడక నేర్పిన చేతులనే నడిరోడ్డున వదిలేస్తున్నారు. పిల్లల నవ్వులే లోకంగా బతికిన పెద్దలు.. ఇప్పుడదే పిల్లల నిర్లక్ష్యంపై న్యాయం కోసం కోర్టుల తలుపులు తడుతున్నరు. ప్రయోజకులను చేసి, ఆస్తులు పంచితే ఆపై అనాథలుగా బతుకీడుస్తున్నామంటూ ఆవేదన చెందుతున్న అవ్వాతాతల దయనీయ పరిస్థితులు తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్నాయి. కన్నవాళ్లను కాదంటున్న సంతానానికి చట్టం ద్వారా బాధ్యత గుర్తుచేసే దుస్థితి రావడం కుటుంబ బంధాల్లో పెరుగుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. పేగు బంధాలే తమను పట్టించుకోవట్లేదంటున్న వృద్ధ తల్లిదండ్రుల ఫిర్యాదుల సంఖ్య భారీగా పెరుగుతున్నది.

ప్రభాత ఉదయం, సెంట్రల్‌ డెస్క్‌ : రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు.. వృద్ధాప్యంలో కొడుకులు, బిడ్డల ఆదరణకు నోచుకోలేకపోతున్నారు. సొంత పిల్లల నిర్లక్ష్యం, ఆర్థిక వేధింపులు, ఆస్తుల వివాదాలతో కొంతమంది వృద్ధులు న్యాయం కోసం పోలీసులను, అధికారులను ఆశ్రయిస్తున్నారు. తెలంగాణలో ఇలాంటి ఫిర్యాదులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2021 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,594 ఫిర్యాదులు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

17 నెలల్లోనే 3,100 ఫిర్యాదులు

రాష్ట్రంలో వృద్ధుల సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయనేది రెవెన్యూ డివిజనల్‌ అధికారులు(ఆర్డీవో) చెప్తున్న గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఏటా సగటున 1,100 నుంచి 1,300 ఫిర్యాదులు నమోదవుతుండగా, గత ఏడాదిలో ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు.  2025 ఏప్రిల్‌ నుంచి 2026 ఆగస్టు వరకు అంటే 17 నెలల్లోనే దాదాపు 3,100 ఫిర్యాదులు నమోదుకాగా, 2021 నుంచి 2026 ఆగస్టు వరకు మొత్తం ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 8,594 కేసులు ఫైల్‌ అయ్యాయి. వృద్ధాప్యంలో తమకు తిండి పెట్టట్లేదని,  ఇంట్లో ఉండనివ్వట్లేదని, ఆస్తుల హక్కులు, ఆర్థిక భద్రత, ఆరోగ్య రక్షణ కల్పించాలని కోరుతూ తల్లిదండ్రులు ఆర్‌‌డీవోలు, పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే, ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అందుబాటులోకి రావడం కూడా ఈ కేసుల సంఖ్య పెరగడానికి కారణమని అధికారులు చెబుతున్నారు.

 హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డిలో ఎక్కువ

రాష్ట్రంలో నమోదైన మొత్తం ఫిర్యాదుల్లో హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల జిల్లాల వాటానే ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో అత్యధికంగా 1078 కేసులు నమోదు కాగా మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లోనే రాష్ట్రంలోని మొత్తం ఫిర్యాదుల్లో దాదాపు 35 శాతం నమోదయ్యాయి. కరీంనగర్‌, నల్లగొండ, హనుమకొండ జిల్లాల్లోనూ 500 నుంచి 600 మధ్య ఫిర్యాదులు ఫైల్‌ అయ్యాయి.

జిల్లాలవారీగా పరిశీలిస్తే..

జిల్లా               కేసుల సంఖ్య

హైదరాబాద్‌              1,078
మేడ్చల్‌           989
రంగారెడ్డి          912

 ఆస్తులు కావాలిగానీ, పట్టించుకోరు..

చాలా సందర్భాల్లో తల్లిదండ్రులకు సొంత ఇళ్లు, ఆస్తులు ఉన్నప్పటికీ పిల్లలు వారిని పట్టించుకోట్లేదని ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. కనీసం తిండి పెట్టరు, ఆసుపత్రికి తీసుకెళ్లరు, వైద్యం వంటి అవసరాలకూ డబ్బులు ఇవ్వడం లేదని ఎంతోమంది పెద్దవాళ్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మరికొందరు పిల్లలు.. తల్లిదండ్రుల ఇళ్లలోనే ఉంటూ అద్దె ఇవ్వకపోగా, తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అండగా ఉండట్లేదు. వారి సంతానం చదువులకు అయ్యే ఖర్చులకే భారంగా ఉందని చెప్తూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు మాత్రమే చెందిన ఇళ్లను ఖాళీ చేయడానికి కొడుకులు, బిడ్డలు నిరాకరిస్తుండటంతో అధికారులు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి ఘటనే ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగింది.

మిర్యాలగూడకు చెందిన రమణారెడ్డి, చంద్రకళ దంపతులు తమ కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడికి గతంలోనే 4 ఎకరాల భూమి ఇచ్చామని, ఇప్పుడు తాము ఉంటున్న ఇంటిని ఆక్రమించుకుని తమను గెంటేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌‌ జోక్యంతో పోలీసులు కుమారుడిని ఖాళీ చేయించి ఇంటిని ఆ వృద్ధ దంపతులకు అప్పగించారు.

నల్లగొండకు చెందిన బెల్లంపల్లి గ్రామంలో ఇలాంటి ఫిర్యాదే నమోదైంది. బిడ్డతోపాటు,  నలుగురు కొడుకులు తనను పట్టించుకోవట్లేదని చంద్రమ్మ అనే పెద్దావిడ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు వాళ్లందరినీ పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. ఇదే జిల్లా ముస్తిపల్లి గ్రామానికి చెందిన రమావత్‌ ధూళి తన ముగ్గురు కుమారులపై ఫిర్యాదు చేశారు. తాను అనారోగ్యానికి గురైతే ఒక కొడుకు జగన్ మాత్రమే ఖర్చులు భరిస్తున్నాడని, మిగతా ముగ్గురు సహకరించట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త మరణం తర్వాత నాలుగు ఎకరాల భూమిని నలుగురికి సమానంగా పంచినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలోనూ 80 ఏళ్ల పెద్దాయన తన మూడో కుమారిడిపై ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోనే ఉంటూ తనను మరుగుదొడ్డి వాడనివ్వట్లేదని, తిండి పెట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని వారసిగూడలోనూ దక్షిణ మధ్య రైల్వేలో పనిచేసి రిటైరైన ఓ అధికారి కుటుంబానికి చెందిన ఆస్తి విషయంలో పోలీసులు జోక్యం చేసుకుంటేగానీ, తల్లిదండ్రులకు వాళ్ల సొంత ఇల్లు దక్కలేదు.

 బాగోగులు చూసుకోకపోతే జీతంలో కోత

వృద్ధ తల్లిదండ్రుల ఆర్థిక భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది. తల్లిదండ్రులను పోషించని ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ‘తెలంగాణ ఎంప్లాయీస్‌ అకౌంటబిలిటీ అండ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ పేరెంటల్‌ సపోర్ట్‌ యాక్ట్‌-2026’ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రతిపాదనను ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో సపోర్టింగ్‌ యాక్ట్‌ను అమలు చేస్తుందని అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. దీంతోపాటు వృద్ధులకు రక్షణ, గౌరవం కల్పించేందుకు ప్రణామ్‌ పేరుతో డే కేర్‌‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త చట్టం ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ వృద్ధ తల్లిదండ్రులను ఆదుకోవాల్సి ఉంటుంది. వారి బాగోగులు చూసుకోవాల్సి ఉంటుంది. బాధ్యతలు విస్మరిస్తే సంబంధిత ఉద్యోగి వేతనం నుంచి గరిష్ఠంగా 15 శాతం లేదా రూ.10 వేలు.. ఏది తక్కువైతే ఆ మొత్తం కోత విధిస్తారు. కోత పెట్టిన ఆ డబ్బును సదరు ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తారు. ఇప్పటికే ఈ చట్టం కింద ఆరు నుంచి ఏడు కేసులు నమోదై వివిధ దశల్లో విచారణలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులకు అవకాశం

వృద్ధులు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ వేదికను కూడా అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశాన్నీ కల్పించింది. అలాగే, కీలక కేసులు, అప్పీళ్లను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే, గతం నుంచీ వృద్ధుల హక్కులు, ఆస్తుల రక్షణ, పోషణకు సంబంధించిన చట్టం అమల్లో ఉంది.  2007 నుంచి అమల్లో ఉన్న.. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టానికి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం అదనపు బలాన్ని చేకూర్చనుంది.