తెలంగాణ

తెలంగాణ ఆకాంక్షకు ఎన్నికల బలం.. టీపీఎస్‌ ఆవిర్భావం, విజయం విలీనం

Agasthya kantu

1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో.. ఉద్యోగాలు, ముల్కీ నిబంధనలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశాలు, ఆంధ్ర–తెలంగాణ ప్రాంతాల మధ్య అభివృద్ధి వ్యత్యాసాలు వంటి అంశాలు ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. విద్యార్థులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించగా.. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యమానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు 1969లో తెలంగాణ ప్రజా సమితి (TPS) ఆవిర్భవించింది. తొలుత తెలంగాణ హక్కుల కోసం పనిచేసిన రాజకీయ వేదికగా ఉన్న టీపీఎస్.. ఉద్యమం తీవ్రతరం కావడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధననే తన ప్రధాన రాజకీయ లక్ష్యంగా ప్రకటించింది. దీంతో అప్పటివరకు ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సాగిన ఉద్యమానికి ఎన్నికల రాజకీయాల్లోనూ ఒక ప్రత్యేక వేదిక ఏర్పడింది.

పార్టీగా మారకముందే.. రెండు ఉప ఎన్నికల్లో విజయాలు

1969 తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్).. అధికారికంగా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారకముందే ఎన్నికల రాజకీయాల్లో తన ప్రభావాన్ని చాటుకుంది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే గురుమూర్తి మరణంతో జరిగిన ఉప ఎన్నిక టీపీఎస్‌కు తొలి అవకాశంగా మారింది. 1970 జూన్‌ 16న వెలువడిన ఫలితాల్లో టీపీఎస్‌ అభ్యర్థి నాగం కృష్ణ సుమారు 14 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో తెలంగాణ ఉద్యమానికి ప్రజల్లో ఉన్న మద్దతు ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిఫలిస్తోందనే సంకేతం వెలువడింది. ఇదే సమయంలో వీబీ రాజు తెలంగాణ ఎమ్మెల్యేలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. 287 మంది సభ్యులున్న శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు అవసరమైన కనీస సంఖ్య 28 మంది సభ్యులు. అప్పటివరకు ఏ ప్రతిపక్ష పార్టీకీ ఆ సంఖ్య లేకపోవడంతో అధికారిక ప్రతిపక్ష నేత లేరు. అయితే 31 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌గా ఏర్పడి, తమ నాయకుడిగా నూకల రామచంద్రారెడ్డిని ఎన్నుకోవడంతో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందనే నేపథ్యంలో వీబీ రాజును రాజ్యసభకు పంపించడంతో, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో సిద్దిపేటలో ఉప ఎన్నిక అనివార్యమైంది. 1970 నవంబర్‌ 17న వెలువడిన ఫలితాల్లో టీపీఎస్‌ అభ్యర్థి మదన్‌మోహన్ విజయం సాధించారు. దీంతో అధికారికంగా రాజకీయ పార్టీగా మారకముందే టీపీఎస్‌ రెండు ఉప ఎన్నికల్లో విజయాలు సాధించి, తెలంగాణ ప్రాంతంలో తనకు పెరుగుతున్న రాజకీయ బలాన్ని చాటుకుంది.

రాజకీయ పార్టీగా లోకసభ ఎన్నికలలో టీపీఎస్‌ సత్తా

తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదికగా కొనసాగుతున్న తెలంగాణ ప్రజా సమితిని (టీపీఎస్‌) పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా ఏర్పాటు చేస్తున్నట్లు 1971 జనవరి 4న సమితి అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి ప్రకటించారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోక్‌సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లడంతో.. టీపీఎస్‌ తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగింది. ‘పార’ గుర్తుపై పోటీ చేసిన టీపీఎస్‌కు ఎదురుగా ఇందిరా కాంగ్రెస్‌ ‘ఆవు–దూడ’ గుర్తుతో బరిలో నిలిచింది.

దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ ప్రభంజనం వీచినప్పటికీ.. తెలంగాణలో మాత్రం ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. తెలంగాణ ప్రాంతంలోని 14 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీపీఎస్‌ 10 స్థానాలను గెలుచుకుని 47.5 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌ కేవలం 3 స్థానాలకే పరిమితం కాగా.. సీపీఐ(ఎం) ఒక స్థానాన్ని గెలుచుకుంది. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను ప్రధాన ఎన్నికల అంశంగా ముందుకు తీసుకెళ్లిన టీపీఎస్‌కు ఈ విజయం ప్రజల్లో ఉన్న ఉద్యమ స్ఫూర్తికి బలమైన రాజకీయ మద్దతుగా నిలిచింది.

దేశమంతా ఇందిరాగాంధీ నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చిన సమయంలో.. తెలంగాణలో మాత్రం టీపీఎస్‌ 14లో 10 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ఉన్న బలాన్ని స్పష్టంగా చాటింది. ఈ ఫలితాలతో తెలంగాణ ఉద్యమం కేవలం వీధి పోరాటంగా కాకుండా.. ఎన్నికల ద్వారా ప్రజా తీర్పును పొందిన రాజకీయ ఉద్యమంగా జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందింది.

కాంగ్రెస్‌లో టీపీఎస్ విలీనం

1971 మధ్యంతర లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. పార్టీపై తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకున్న ఇందిరాగాంధీ.. తెలంగాణలో టీపీఎస్‌ సాధించిన 10 లోక్‌సభ స్థానాల విజయాన్ని కూడా రాజకీయంగా పరిగణనలోకి తీసుకున్నారు. త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన టీపీఎస్‌ను క్రమంగా కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే దిశగా చర్చలు ప్రారంభమయ్యాయి.

ఇందిరాగాంధీ, టీపీఎస్‌ నాయకత్వం మధ్య జరిగిన చర్చల అనంతరం 1971 సెప్టెంబర్‌ 18న టీపీఎస్‌ కార్యవర్గం కాంగ్రెస్‌లో విలీనం కావాలని నిర్ణయించింది. మరుసటి రోజు, సెప్టెంబర్‌ 19న టీపీఎస్‌ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన రాష్ట్ర కౌన్సిల్‌ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అనంతరం సెప్టెంబర్‌ 24న ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలోనూ టీపీఎస్‌ విలీనానికి ఆమోద ముద్ర పడింది. దీంతో ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌తో ఆవిర్భవించి, 1971 లోక్‌సభ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన తెలంగాణ ప్రజా సమితి.. చివరకు కాంగ్రెస్‌లో విలీనమైంది. అలా తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదికగా ఏర్పడిన టీపీఎస్‌.. లోక్‌సభలో తన బలాన్ని నిరూపించిన కొద్ది నెలలకే కాంగ్రెస్‌లో కలిసిపోయింది. అయితే ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష మాత్రం అంతటితో ముగియలేదు. టీపీఎస్‌ విలీనం తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ రాజకీయ చర్చల్లో కొనసాగుతూ.. భవిష్యత్‌ తెలంగాణ ఉద్యమాలకు పునాదిగా నిలిచింది.

టీపీఎస్ విలీనం.. షరతులతో

తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేసే క్రమంలో మర్రి చెన్నారెడ్డి కొన్ని కీలక డిమాండ్లను ఇందిరాగాంధీ ముందు ఉంచారు. వీటినే ‘ఆరు సూత్రాలు’ (షట్‌సూత్రాలు)గా పేర్కొంటారు. ఇందులో ప్రధానమైనది అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని పదవి నుంచి తప్పించడం. తెలంగాణలో నెలకొన్న రాజకీయ అసంతృప్తికి పరిష్కారంగా నాయకత్వ మార్పు అవసరమని చెన్నారెడ్డి పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందరెడ్డి 1971 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

చెన్నారెడ్డి సూచన మేరకు.. పీవీకి ముఖ్యమంత్రి పదవి

బ్రహ్మానందరెడ్డి రాజీనామా తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావును ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం మరో కీలక పరిణామంగా మారింది. పీవీ పేరు ఎంపికలో చెన్నారెడ్డి సూచనకు ప్రాధాన్యం ఉందని అప్పటి రాజకీయ పరిణామాలపై వచ్చిన విశ్లేషణలు చెబుతాయి. 1971 సెప్టెంబర్ 25న పీవీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి, సెప్టెంబర్ 30న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చెన్నారెడ్డి సూచించిన పలువురు నేతలకు మంత్రివర్గంలో ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం దక్కకపోవడం, చివరకు ఆయన సూచించిన పేర్లలో కేవలం ఇద్దరికే మంత్రి పదవులు దక్కడంతో ఇరువర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి.

కొద్ది రోజుల్లోనే చెన్నారెడ్డి–పీవీ మధ్య విభేదాలు

టీపీఎస్ విలీనం తర్వాత తొలుత ఒకే రాజకీయ శిబిరంలో ఉన్నప్పటికీ.. చెన్నారెడ్డి, పీవీ నరసింహారావు మధ్య సంబంధాలు ఎక్కువకాలం కొనసాగలేదు. తెలంగాణ సమస్యపై చెన్నారెడ్డి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతుండగా, పీవీ మాత్రం సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనే తెలంగాణ ప్రయోజనాలను కాపాడే దిశగా వ్యవహరించారు. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ దూరం క్రమంగా పెరిగింది.

ప్రత్యేక తెలంగాణపై ఇందిర వైఖరిలో మార్పు

1969 ఉద్యమం, 1971 లోక్‌సభ ఎన్నికల్లో టీపీఎస్ విజయాల తర్వాత కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కొనసాగింది. అయితే 1972 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇందిరాగాంధీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తక్షణ అవకాశం లేదనే సంకేతాలను ఆమె ఇచ్చారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేస్తామని, ప్రాంతీయ అసమానతలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రానికి బదులుగా అభివృద్ధి, రక్షణలు, సమాన అవకాశాల ద్వారా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.

1972 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. మళ్లీ పీవీ సీఎం

ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగిన 1972 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్‌లో విలీనం కావడం కూడా కాంగ్రెస్‌కు రాజకీయంగా బలాన్ని ఇచ్చింది. ఎన్నికల అనంతరం పీవీ నరసింహారావు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈసారి ఆయన ముందున్న సవాలు తెలంగాణ సమస్య మాత్రమే కాదు.. త్వరలోనే ఉద్భవించబోయే జై ఆంధ్ర ఉద్యమం రూపంలో మరో ప్రాంతీయ సంక్షోభం ఎదురుకానుంది. దీంతో 1967లో ప్రారంభమైన ఈ శాసనసభ కాలం తెలంగాణ ఉద్యమం నుంచి జై ఆంధ్ర ఉద్యమం, చివరకు రాష్ట్రపతి పాలన వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత కల్లోలభరిత దశగా మారింది.