తెలంగాణలో నవంబర్‌ నెలలో రేషన్‌ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల పంపిణీ. 
తెలంగాణ

వచ్చే నెల నుంచే రేషన్‌లో 9 రకాల సరుకులు?

తెలంగాణలో రేషన్‌ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఒక్కో కార్డుకు రూ.800 ఖర్చవుతుందని అంచనా.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌ : రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్న ప్రతిపాదనపై పౌరసరఫరాల శాఖ కసరత్తు కీలక దశకు చేరుకుంది. ఈ సరుకుల పంపిణీకి ఒక్కో రేషన్‌ కార్డుపై సుమారు రూ.800 ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే సరుకులను ఉచితంగా అందిస్తారా, సబ్సిడీ ధరకు విక్రయిస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రతిపాదన

ఎల్‌నినో ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రేషన్‌ దుకాణాల ద్వారా వాటిని పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోధుమపిండి, చక్కెర, నూనె, చింతపండు, పసుపు, ఉప్పు, కారం తదితర సరుకులను అందించాలని యోచిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘అమ్మహస్తం’ పథకం కింద తొమ్మిది రకాల సరుకులను రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేసింది. ప్రస్తుతం కూడా దాదాపు అవే సరుకులను అందించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

ఒక్కో కార్డుకు రూ.800 ఖర్చు

ప్రతిపాదన ప్రకారం ఒక్కో రేషన్‌ కార్డుపై 3 కిలోల గోధుమపిండి, అరకిలో చక్కెర, కిలో ఉప్పు, కిలో కారం, లీటరు నూనె, కిలో చింతపండు, కిలో పసుపు అందించనున్నారు. ఈ సరుకుల పంపిణీకి ఒక్కో కార్డుపై రూ.800 ఖర్చవుతుందని అంచనా. రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్‌ కార్డులు ఉండటంతో, ఒక్కో కార్డుకు రూ.800 చొప్పున ఖర్చు చేస్తే నెలకు ప్రభుత్వంపై అదనంగా రూ.848 కోట్ల భారం పడే అవకాశం ఉంది. సరుకులను సబ్సిడీ ధరకు అందిస్తే ప్రభుత్వంపై పడే భారం కొంత తగ్గనుంది.

నవంబర్‌లో ఒక్క నెల పంపిణీ

నవంబర్‌లో ఒక్క నెల మాత్రమే ఈ సరుకులను పంపిణీ చేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 17,348 రేషన్‌ దుకాణాలకు ఇప్పటికే రేషన్‌ కోటా చేరింది. సరుకుల పంపిణీ విధానం, ధరలపై మరో వారం రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.