తెలంగాణ

విద్యుత్ వినియోగంలో సరికొత్త హిస్టరీ

Tejaswini
  • తెలంగాణలో 19,543 మెగావాట్లకు చేరిన విద్యుత్ డిమాండ్

  • గతేడాదితో పోలిస్తే 23 శాతం పెరిగిన వాడకం

తెలంగాణలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 19,543 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది ఇదే రోజున 15,906 మెగావాట్ల విద్యుత్ నమోదు కాగా, ఈ ఏడాది 23 శాతం పెరిగింది. వ్యవసాయ, డొమెస్టిక్, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు  ఎల్‌నినో  పరిస్థితులు కూడా విద్యుత్ వినియోగానికి కారణమయ్యాయని అంచనా వేస్తున్నారు.   

వేసవి ప్రభావం, వ్యసాయ రంగం కారణాలతో ఈ ఏడాది మార్చిలో పవర్ ఎక్కువగా వినియోగించినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది మార్చి 13న 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ స్థిరంగా పెరుగుతూ వస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 15,497 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ డిమాండ్, 2023-24లో 15,623 మెగావాట్లకు, 2024-25లో 17,162 మెగావాట్లకు పెరిగి, తాజాగా 19,543 మెగావాట్ల మైలురాయిని దాటింది.