తెలంగాణ

ఈసారి ముందుగానే రైతుభరోసా?

ఎల్​నినో ఎఫెక్ట్​తో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ వారికి కాస్త భరోసానిచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులను ఈసారి ముందుగానే ఇవ్వాలని యోచిస్తోంది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌:

ఎల్​నినో ఎఫెక్ట్​తో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ వారికి కాస్త భరోసానిచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులను ఈసారి ముందుగానే ఇవ్వాలని యోచిస్తోంది. రెండు నెలలు ముందుగా.. జనవరిలోనే రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్​ సర్కార్​ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.12 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. యాసంగి సాగుకు రూ.6 వేలు, వానకాలం సాగుకు రూ.6 వేల చొప్పున సాయం అందజేస్తూ వస్తోంది. గత 2025 యాసంగి సీజన్​లో కోటి 50 లక్షల ఎకరాల సాగుకు సంబంధించి సుమారు 70 లక్షల మంది రైతులకు రూ.9 వేల కోట్లను మూడు విడతల్లో పంపిణీ చేసింది. అయితే, గతేడాది మార్చి, ఏప్రిల్​ నెలల్లో ఈ సాయాన్ని అందజేసింది. కానీ ఈసారి మాత్రం జనవరిలోనే రైతుభరోసా నిధులు అందజేయాలని ప్రభుత్వం రెడీ అవుతోంది. 70 లక్షల రైతులకు కోటి 26 లక్షల ఎకరాలకు గానూ రూ.7,560 కోట్లు చెల్లించేందుకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఎకరా భూమి ఉన్న రైతులకు మొదటి విడతలో, రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న రైతులకు రెండో విడతలో, మూడు నుంచి ఐదెకరాలు ఉన్నవారికి మూడో విడతలో, ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు నాలుగో విడతలో సాయం అందించనున్నట్లు తెలుస్తోంది.

ఎల్​నినో వేళ రైతులను ఆదుకునేందుకు..

ఎల్‌నినో ప్రభావంతో వానకాలం పంటలు చేతికొచ్చే దశలో నీరు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో యాంసగిలో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తక్కువ పెట్టుబడి, తక్కువ కాలంలో పంటలు పండించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరింది. వానకాలం సీజన్‌లో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ప్రభుత్వం 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో యాసంగి పంటల సాగుకు రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని ముందుగానే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు వ్యవసాయ శాఖకు ఎలాంటి సమాచారం అందలేదు. త్వరలోనే ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విపత్కర పరిస్థితుల్లో రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. రైతు భరోసా ఇస్తే సరిపోదని, ఆరుతడి పంటలకు ఎంత ధర ఇస్తారో చెప్పాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి. సాగర్  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాటి ధరలను కూడా ముందుగానే నిర్ణయించాలని డిమాండ్​ చేశారు.