ప్రభాత ఉదయం, హైదరాబాద్ : రాష్ట్రంలో పాఠశాల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిధులు నిలిపివేసింది. క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న సర్కార్.. నిధుల విషయంలో వెనుకడుగు వేస్తోంది. 2017-18 విద్యా సంవత్సరం మొదలు ఇప్పటివరకు దాదాపు రూ.13 కోట్ల బకాయిలున్నాయి. ఏటా నిధులు విడుదల చేయకపోవడంతో క్రీడా పోటీలు నిర్వహించడం కష్టతరంగా మారిందని పీఈటీలు, జిల్లా కార్యదర్శులు వాపోతున్నారు. స్కూల్ విద్యార్థుల ఆటలపోటీలకు ఇప్పటికైనా పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నాయకులు కోరుతున్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు, వారి ఉజ్వల భవిష్యత్ కోసం చాలా మంది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యదర్శులు సొంత ఖర్చులతో పోటీలు నిర్వహించారు. ఏళ్ల తరబడి నిధులు మంజూరు కాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో సమగ్ర శిక్షా నిధుల నుంచి సర్దుబాటు చేద్దామని ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల కారణంగా కుదరట్లేదని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న నిధుల నుంచి 33 జిల్లాలకు రూ.5 లక్షల చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.3 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు పాఠశాల విద్యా డైరెక్టరేట్ ఇటీవల ప్రతిపాదనలు పంపగా రూ.1.5 కోట్లు మాత్రమే విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న రూ.13 కోట్లు కూడా వెంటనే విడుదల చేయాలని కోరినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.