ప్రభాత ఉదయం, హైదరాబాద్: అంతర్జాతీయ ఉన్నత విద్యా రేటింగ్ ఏజెన్సీ ‘క్వాక్వరెల్లి సైమండ్స్’ (క్యూఎస్) ‘ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్–2027’లో తెలంగాణ వెనుకబడింది. ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఏకంగా 180 స్థానాలు దిగజారి 650వ ర్యాంక్‌కు పడిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) సైతం 246వ ర్యాంక్ నుంచి 24 స్థానాలు దిగజారి 270వ స్థానానికి చేరింది. ఇందుకు భిన్నంగా వరంగల్ ఎన్ఐటీ 771-780 రేంజ్ నుంచి 624వ ర్యాంక్‌కు ఎగబాకింది. హైదరాబాద్ ఐఐటీ 270వ స్థానం నుంచి 19 స్థానాలు మెరుగుపడి 251వ స్థానాన్ని కైవసం చేసుకున్నది. జేఎన్టీయూ హైదరాబాద్ తొలిసారిగా ఈ ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించి, 1201-1300 రేంజ్లో నిలబడింది. ప్రైవేట్ యూనివర్సిటీ వోక్సెన్ అద్భుత పురోగతితో 694వ స్థానం నుంచి 499 స్థానానికి చేరుకుంది. సరిపడా బోధనా సిబ్బంది లేకపోవడంతో ఈ ర్యాంకింగ్స్‌లో ఉస్మానియా వర్సిటీ వెనుకపడింది. రీసెర్చ్ కోసం వివిధ విభాగాలకు కేటాయించే నిధులపరమైన కొరత కూడా ఉందని తెలుస్తోంది.
ప్రమాణాలే ప్రామాణికం
క్యూఎస్ సంస్థ ఏటా నవంబర్ మొదటి వారంలో ఆసియా ఖండానికి సంబంధించిన యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌ను విడుదల చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరానికి ఉపయోగపడేలా ఈ ర్యాంకింగ్స్‌ను ఏడాది ముందే విడుదల చేస్తుంటారు. విద్యావేత్తలు, ప్రొఫెసర్లతో యూనివర్సిటీలను సర్వే చేయించి వాటి బోధనా ప్రమాణాలు, విద్యానాణ్యత, విద్యార్థుల అభిప్రాయాల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. వర్సిటీల అధ్యాపకుల ఉన్నత విద్యార్హతలు, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ అమలును కూడా పరిగణనలోకి తీసుకుంటారు.