ప్రభాత ఉదయం, ముషీరాబాద్ : తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి సేవలను క్రమబద్ధీకరించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, 7వ పీఆర్సీ, యూజీసీ వేతన స్కేళ్లను అమలు చేయాలని కోరారు. ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య సూచించారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరశురాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించడం, అప్పటివరకు ఉద్యోగ భద్రత కల్పించడం, 7వ పీఆర్సీ, యూజీసీ స్కేళ్లు అమలు చేసిన తర్వాతే కొత్త నియామకాలు చేపట్టడం వంటి అంశాలపై చర్చించారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా కాంట్రాక్ట్ అధ్యాపకుల డిమాండ్లు న్యాయమైనవేనని చెప్పారని గుర్తుచేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి సమస్యను పరిష్కరించవచ్చన్నారు. క్రమబద్ధీకరణకు విశ్వవిద్యాలయాల వైస్చాన్స్లర్లు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. యూజీసీ నిబంధనలను పరిశీలించి, ఇతర రాష్ట్రాల్లో ఈ సమస్యను ఎలా పరిష్కరించారో అధ్యయనం చేయాలని సూచించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఉన్నత విద్య అభివృద్ధికి శాశ్వత అధ్యాపకుల నియామకాలు చేపట్టడంతో పాటు నాణ్యమైన బోధనా సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు భవిష్యత్తుపై భరోసా లేకపోవడం విద్యావ్యవస్థపై ప్రభావం చూపుతుందని అన్నారు. యూజీసీ నిబంధనలు, కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఉద్యోగులకు పదవీ విరమణ వరకు ఉద్యోగ భద్రత కల్పించేలా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్ట్ పోస్టులకు ఇబ్బందులు కలగకుండా రక్షణ కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యా కమిషన్, ప్రభుత్వ అధికారులతో చర్చించి క్రమబద్ధీకరణ, పే రివిజన్, వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారానికి త్వరలో మరోసారి ప్రభుత్వాన్ని కలుస్తామని వెల్లడించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్, అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ కరుణాకర్‌రావు, డాక్టర్ భూమయ్య, డాక్టర్ శ్యాంసుందర్, డాక్టర్ సురేష్, డాక్టర్ రామకృష్ణయ్య, డాక్టర్ విజయేందర్‌రెడ్డి, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ రవి, డాక్టర్ తిరుపతి, డాక్టర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.