అకాల వర్షాలకు మార్కెట్‌ యార్డుల్లో తడిసిన ధాన్యం. 
తెలంగాణ

తడిసిన ధాన్యం.. అన్నదాతల దైన్యం

అకాల వర్షాలకు మెదక్‌, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌ యార్డుల్లో తడిసిన ధాన్యం.

Phaneendra

ప్రభాత ఉదయం, నర్సాపూర్ : ఓ వైపు ఎల్‌నినో ప్రభావం.. మరోవైపు విద్యుత్ కోతలు, నీటి ఎద్దడి.. ఇన్ని కష్టాలను ఎదుర్కొని చుక్కచుక్క నీటిని ఒడిసిపట్టి, ఆరుగాలం కష్టపడి వరి పండించిన అన్నదాతకు మెదక్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షం కన్నీళ్లను మిగిల్చింది. నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి, కొల్చారం, హత్నూర, చిలిపిచెడ్, శివంపేట, వెల్దుర్తి మండలాల్లో కురిసిన వర్షానికి పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లు తడిసి ముద్దయ్యాయి.  కొల్చారం మండల కేంద్రంలో సుమారు గంటపాటు కురిసిన వానతో కొనుగోలు కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది. ‘‘ఇప్పటికే పంట సాగు నుంచి కోతల వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అకాల వర్షం రూపంలో మరో దెబ్బ తగిలింది. ధాన్యం వర్షపు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి నిరాశకు గురి చేసిందని” మహిళా రైతు అంజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

 చౌటుప్పల్‌లో..

కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతులను అకాల వర్షం మరింత ఆవేదనకు గురిచేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌లో అర్ధరాత్రి కురిసిన వానకు ధాన్యం తడిసిపోయింది. మార్కెట్‌ యార్డుకు తరలించి 15 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షం రూపంలో పెద్ద ఎత్తున పెరిగిన ధాన్యం నిల్వలు తడిసిపోయాయి.  దీంతో నాణ్యత తగ్గి, మద్దతు ధర లభించదేమోనని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కొనుగోళ్లలో జాప్యం.. మరోవైపు అకాల వర్షాలతో రైతులు నష్టాల బారిన పడుతున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతున్నారు.