ప్రభాత ఉదయం, హైదరాబాద్: నదీ జలాల పంపిణీ వ్యవహారంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) తీరుపై తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డు నిర్ణయాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. కృష్ణా బోర్డుకు ‘డబ్బులిచ్చి మరీ తిట్టించుకొంటున్నట్లు’గా ఉందని జల వనరుల మంత్రిత్వశాఖలోని కొందరు సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు వాపోయారు. ‘బోర్డు నిర్వహణ, కేఆర్‌ఎంబీ ఇంజినీర్లు, అధికారులు, ఇతర సిబ్బందికి జీతభత్యాలకు అవసరమైన నిధులను దామాషా ప్రకారం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు భరిస్తున్నాయి. అయినప్పటికీ బోర్డు నిర్ణయాలన్నీ ఏపీకే అనుకూలంగా ఉంటున్నాయి. తెలంగాణ వినతులను బుట్టదాఖలు చేయడం, లేదా తమ పరిధిలో లేవని చేతులెత్తేయడం, బోర్డు అధికారులకు పరిపాటిగా మారింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్టోబర్ తెలంగాణ వాటాగా ఇవ్వాల్సిన రూ.2.16 కోట్ల నిధులను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.
72 టీఎంసీలు తరలించుకుపోయినా పట్టించుకోలే..
తెలంగాణ జలవనరులు అధికారులు మాట్లాడుతూ ‘ఎల్‌నినో ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. కృష్ణా నదికి వచ్చిన కొద్దిపాటి వరదను ఏపీ తన్నుకుపోతున్నా కేఆర్‌ఎంబీ అధికారులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం ఒక్క వార్నింగ్ నోటీసు కూడా ఇవ్వలేదు’ అని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వానాకాలం సీజన్లో ఈ సీజన్లో శ్రీశైలం జలాశయానికి 227 టీఎంసీల వరద మాత్రమే వచ్చిందని, ఈ నీటిని కూడా ఏపీ ఏకపక్షంగా తీసుకెళ్తున్నా బోర్డు అధికారులు చూస్తూ ఉండపోయారని విమర్శించారు. కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, సుంకేసుల, హంద్రీనీవాల ద్వారా మొత్తం 166 టీఎంసీలు వినియోగించుకోగా, ఇందులో తెలంగాణ వాడుకున్నది కేవలం 12 టీఎంసీలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ 79 రోజుల్లో ఏకంగా 72 టీఎంసీల నీటిని తరలించుకుపోయినా బోర్డు అధికారులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో డెడ్ స్టోరేజ్ లెవెల్‌ను మినహాయిస్తే 27 టీఎంసీలు నీరు అందుబాటులో ఉందని వివరించారు. ఈ నీటితో వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు కనీసం తాగడానికి కూడా నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొందన్నారు. ఆ నీటిని కూడా 66:34 నిష్పత్తిలో వాటాలు పంచాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అందుకే బోర్డు వైఫల్యాలపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి ఉందని సదరు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వినతులను ఒక్కదాన్నీ కేఆర్‌ఎంబీ పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాల్సిన అంశాన్ని కూడా మరిచిపోయిందని వ్యాఖ్యానించారు. అంతేగాక ఏపీ ప్రభుత్వం నీటి తరలింపు తెలుసుకోవడానికి టెలిమెట్రీలు ఏర్పాటు చేయలేదన్నారు. ఉన్న గేజింగ్ పరికరాలను ఏపీలో ధ్వంసం చేసినా బోర్డు ఆ వైపు కన్నెత్తి చూడలేదన్నారు. ఇలా ఎన్నో అంశాల్లో బోర్డు వైఫల్యం, పక్షపాత ధోరణులతో తెలంగాణ ప్రభుత్వం నిధులు నిలిపివేసినట్లు తెలుస్తోందని అధికారులు తెలిపారు. నవంబర్ 5న జరగబోయే 21వ బోర్డు సమావేశంలో వివిధ అంశాలపై కేఆర్ఎంబీని నిలదీయాలని నిర్ణయించుకొన్నామని అధికారులు వివరించారు.