ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై సమావేశమైన టీజీఈ జేఏసీ నాయకులు. 
తెలంగాణ

దీపావళి తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ : టీజీఈ జేఏసీ హెచ్చరిక

పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, రెండో పీఆర్సీ ప్రకటించి 51 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని టీజీఈ జేఏసీ డిమాండ్ చేసింది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల పెండింగ్​ సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్​ ఆఫీసర్స్​, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్(టీజీఈ) జేఏసీ నాయకులు డిమాండ్​ చేశారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మూడుసార్లు సమ్మె వాయిదా వేశామని, అయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆదేశాలకు కూడా ఉన్నతాధికారులు విలువ ఇవ్వడం లేదన్నారు. రెండో పే రివిజన్​ కమిటీ వెంటనే ప్రకటించాలని, సీపీఎస్​ ఉద్యోగులకు ఓపీఎస్​ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. తమ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రానున్న గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే దీపావళి తరువాత విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. జేఏసీ చైర్మన్​ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్​ ఏలూరి శ్రీనివాస్ రావు అధ్యక్షతన శుక్రవారం నాంపల్లిలోని గృహకల్ప కాంప్లెక్స్​లోని టీజీవో భవన్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్​ ఏలూరి శ్రీనివాస్​ రావు మీడియాతో మాట్లాడారు. 2వ పే రివిజన్​ కమిటీ నివేదికను ప్రకటించాలని, 51 శాతం ఫిట్​మెంట్​తో 2023 జులై 1 నుంచి పీఆర్సీ అమలు చేయాలని కోరారు. పెండింగ్​ బకాయిల చెల్లింపు కోసం ప్రతి నెలా చెల్లిస్తున్న వెయ్యి కోట్లను ఈ నెల నుంచి 2 వేల కోట్లకు పెంచాలన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్​ స్కీమ్​ను రద్దు చేసి, పాత పెన్షన్​ స్కీమ్​ను పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు. న్యూ ఎంప్లాయీస్​ హెల్త్​ స్కీమ్​ను పటిష్టంగా చేయాలని కోరారు. జీవో 317, 190ను అన్ని శాఖల్లో అమలు చేయాలన్నారు. సమావేశంలో చావ రవి, సదానందం గౌడ్, బీ మధుసూదన్ రెడ్డి, గౌతమ్​ కుమార్,  ముజీబ్​ హుస్సేన్, శ్యామ్, కటకం రమేశ్​, అనిల్ కుమార్, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి, ఉమాదేవి, వెంకట్, సత్యనారాయణ గౌడ్, కస్తూరి వెంకట్​ పాల్గొన్నారు.