ప్రభాత ఉదయం, మహేశ్వరం : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలోని రూ.300 కోట్ల విలువైన పీటీ (రక్షిత కౌలు) భూముల వివాదంపై రాష్ట్ర విజిలెన్స్ కమిటీ విచారణ చేపట్టింది. స్థానిక రైతుల ఫిర్యాదుల మేరకు గురువారం మహేశ్వరం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను పరిశీలించిన అధికారులు.. రెవెన్యూ సిబ్బందితో కలిసి వివాదాస్పద భూములను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రక్షిత కౌలు చట్టం పరిధిలోని భూముల విషయంలో హక్కులు, అనుమతులపై స్పష్టత వచ్చే వరకు కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తప్పుడు నివేదికలతో భూకబ్జా యత్నాలు?
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో తప్పుడు నివేదికలు రూపొందించి, జేపీ ఇన్ఫ్రా, కాంక్రీట్ ఇన్ఫ్రా, భువన్ ఇన్ఫ్రా సంస్థల ద్వారా తమ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.
రెవెన్యూ నివేదికల్లో వైరుధ్యాలు
మహేశ్వరం తహసీల్దార్ సమర్పించిన నివేదికల్లో పరస్పర విరుద్ధమైన వివరాలు ఉన్నాయని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా నివేదికలు ఎలా రూపొందించారనే అంశంపైనా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. సర్వే నంబర్లు 371, 372, 377 పరిధిలోని భూముల హక్కులు, రెవెన్యూ రికార్డులపై స్పష్టత తీసుకురావాలని కోరారు.
ప్లాట్ల క్రయవిక్రయాలు నిలిపివేయాలని విజ్ఞప్తి
తుమ్మలూరులోని వివాదాస్పద భూముల విలువ సుమారు రూ.300 కోట్లు ఉంటుందని రైతులు తెలిపారు. తమ భూములను కాపాడటంతో పాటు, ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. భూములపై హక్కులు, రెవెన్యూ రికార్డులు, లేఅవుట్లకు అధికారిక అనుమతులపై స్పష్టత వచ్చే వరకు వివాదాస్పద లేఅవుట్లలో ప్లాట్ల క్రయవిక్రయాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.