నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) శిథిలావస్థకు చేరింది. గోదాములా మారడంతో వైద్య సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇటీవల కురిసిన వానకు ఆస్పత్రి పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. భవనం దుస్థితిని పరిశీలించిన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాహుల్.. దవాఖానను తాత్కాలికంగా సమీపంలోని గ్రంథాలయంలోకి మార్పించారు. ‘‘గ్రంథాలయంలో ఆస్పత్రి నిర్వహణకు ఒకే గదిని కేటాయించడంతో రోగులకు సేవలు అందించడం కష్టంగా ఉంది. మందుల నిల్వ, రక్త పరీక్షలు చేయడానికి స్థలం సరిపోవడం లేదు. ఈ సమస్యను ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాం.’’ అని పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ వనిత పేర్కొన్నారు.