మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
తెలంగాణ

క్రాప్ హాలిడే ప్రకటించలేదు : మంత్రి తుమ్మల

క్రాప్ హాలిడేపై ప్రతిపక్షాల ప్రచారాన్ని మంత్రి తుమ్మల ఖండించారు. రైతు వేదికల ద్వారా పంటల ఎంపిక, విత్తనాలు, నీటి వినియోగంపై సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రతిపక్షాలు మానుకోవాలని ఆయన విపక్షాలకు ఓ ప్రకటనలో సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఎల్ నినో ముప్పపై ఆరునెలల నుంచే రైతాంగాన్ని అప్రమత్తం చేస్తూ, ఆర్థికంగా నష్టపోకుండా ఆరుతడిపంటల సాగును ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. కరువు మండలాల పంట నష్టంపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే మొదలుపెట్టారని తుమ్మల తెలిపారు. వాతావరణ మార్పులు, వర్షపాతం అంచనాలు, భూగర్భ జలాల లభ్యతను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ శాఖ ముందస్తు కార్యాచరణ రూపొందించిందని చెప్పారు.

 రైతు వేదికలు కేంద్రంగా సూచనలు

రైతు వేదికలను కేంద్రంగా చేసుకుని వ్యవసాయ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా పంటల ఎంపిక, విత్తనాల లభ్యత, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై రైతులకు సూచనలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రైతు వేదికల ద్వారా 26847 క్వింటాళ్ల శనగలు, 703 క్వింటాళ్ల పెసలు, 1369 క్వింటాళ్ల మినుములు, 28460 క్వింటాళ్ల వేరుశనగ, 200 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు, 148 క్వింటాళ్ల నువ్వులు, 174 క్వింటాళ్ల కుసుమ వంటి ఆరుతడి పంటల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందచేయనున్నట్టు వివరించారు.