హైదరాబాద్: రాష్ట్రంలోని మార్కెట్ యార్డులను ఆధునికీకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రాహుల్ రాజ్‌తో మార్కెట్ యార్డుల అభివృద్ధి, సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, డిజిటలైజేషన్, గోదాముల నిర్మాణం తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులను సమగ్రంగా అనుసంధానించి, వాటి నిర్వహణను డిజిటల్ విధానంలోకి తీసుకొచ్చే ప్రక్రియ పురోగతిపై మంత్రి ఆరా తీశారు. మార్కెట్ యార్డులోకి వాహనం ప్రవేశించిన దశలో ప్రారంభించి, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు, తూకం, లావాదేవీలు, చెల్లింపులు పూర్తిచేసుకుని వాహనం బయటకు వెళ్లే వరకు ప్రతి దశలో డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. రైతులకు చెల్లింపులు ఆన్లైన్లోనే జరిగేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. ఈ విధానం ద్వారా మార్కెట్ల నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకత పెరగడంతో పాటు అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడవచ్చని పేర్కొన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల నిల్వపై సూచనలు
మార్కెట్ల డిజిటలైజేషన్‌కు సంబంధించి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసి, 15 రోజుల్లోగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఇప్పటికే 10 మార్కెట్ యార్డుల్లో సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు పనులు జరుగుతుండగా, మిగిలిన మార్కెట్ యార్డుల్లోనూ దశలవారీగా ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. తక్కువ స్థలంలో ఎక్కువ పరిమాణంలో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా సైలోస్ విధానంలో గోదాములను డిజైన్ చేసి నిర్మాణాలు చేపట్టాలని మంత్రి సూచించారు. మార్కెటింగ్ శాఖ పరిధిలోని గోదాముల నిల్వ సామర్థ్యాన్ని 2 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే లక్ష్యంతో అవసరమైన గోదాముల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు సరిపడా సదుపాయాలు కల్పించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి తుమ్మల.
కోహెడ్ మార్కెట్ పనులను వేగవంతం చేయాలి...
మార్కెటింగ్ శాఖలో అవసరమైన ఇంజినీరింగ్ అధికారుల నియామకాలను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. టీజీపీఎస్సీ లేదా జేఎన్టీయూ ద్వారా నియామకాలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుని, శాఖలో సాంకేతిక సిబ్బంది కొరతను అధిగమించాలని అధికారులను ఆదేశించారు. అజీజ్‌నగర్‌లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొత్త మార్కెట్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. తూప్రాన్, గజ్వేల్, సూర్యాపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న సమీకృత మార్కెట్లను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఎండీ ఉపేందర్ రెడ్డితో మాట్లాడిన మంత్రి, కోహెడ్ మార్కెట్ పనులను చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మార్కెట్ అభివృద్ధికి సంబంధించిన పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.