Two siblings found dead in farm well in Adilabad 
తెలంగాణ

ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల మృతి

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఇద్దరు అన్నదమ్ముల మృతదేహాలు బావిలో లభ్యమయ్యాయి. వారి మృతిపై అనుమానాలున్నాయని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Suryanarayana

ప్రభాత ఉదయం, ఉట్నూర్ : ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన ఇంద్రవెల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది.

మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  ఇంద్రవెల్లి మండలంలోని హర్కాపూర్ తండాకు చెందిన రాథోడ్ హేమన్‌రావ్‌కు ఇద్దరు కుమారులు రాథోడ్ అరవింద్(35), రాథోడ్ ప్రవీణ్(32) మేస్త్రి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం వారిద్దరూ పనికి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి సాలెవాడకు వెళ్లారు.

రెండు రోజులైనా తిరిగి రాలేదు. మంగళవారం హీరాపూర్ గ్రామ సమీపంలోని బావిలో వారి మృతదేహాలను స్థానికులు గుర్తించి తమకు తెలియజేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమారుల మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని హేమన్‌రావ్ ఫిర్యాదు చేసినట్లు ఇంద్రవెల్లి పోలీసులు చెప్పారు.

శోకసంద్రంలో కుటుంబం

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అరవింద్‌కు భార్య, ముగురు పిల్లలు, ప్రవీణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కుటుంబాలకు అన్నీ వారే అయిన యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, చిన్నారులు విలపించిన తీరు గ్రామస్తులను కూడా కన్నీళ్లు పెట్టించింది.