పిట్లగూడెం మార్గంలోని వంతెన దుస్థితి 
తెలంగాణ

రోడ్డు లేని గూడేలు.. జనం గుండెల్లో గుబులు

ప్రాణాలు కోల్పోతున్న ఆదివాసీలు

Ranjith

ప్రభాత ఉదయం, ఉట్నూర్: ఏజెన్సీ ఏరియాలో మౌలిక వసతులు లేక అడవి బిడ్డలకు ఏళ్ల నుంచి గోస తప్పడం లేదు. రోడ్డు మార్గం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా వెళ్లలేని దుస్థితి. గతుకుల రోడ్లపైనే రాకపోకలు సాగిస్తూ యాతనపడుతున్నారు.

కవలలకు జన్మనిచ్చి.. తనువు చాలించి

మండల పరిధిలోని రాజులమడుగు గ్రామానికి చెందిన ఓ గర్భిణి పురిటినొప్పులతో తీవ్ర అస్వస్థతకు గురైంది. అంబులెన్స్ వచ్చేందుకు మార్గంలేక వారు ఆటోలో ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో వాహనం పాడవడంతో చేసేదేమీ లేక ఇంటికి తీసుకెళ్లారు. కవలలకు జన్మనిచ్చిన ఆ మహిళ, నవజాత శిశువు తనువుచాలించారు. ఏజెన్సీ ఏరియాల్లో ఇటువంటి ఘటనలు అనేకం.  

రూ.కోట్లలో నిధులు.. పనులు శూన్యం

తరాలు మారుతున్నా ఆదివాసీల తలరాతలు మారడం లేదు. ఐటీడీఏ నుంచి గిరిజన గ్రామాలకు, గూడేలకు రోడ్డు సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వం నుంచి ఐటీడీఏకు ప్రతీ ఏడాది రూ.కోట్లలో నిధులు వస్తున్నా.. వసతుల కల్పనలో విఫలమవుతున్నారని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న గ్రామాల్లోనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయంటే.. మూరుమూల గూడేల్లోని దుస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో అంతే..

ప్రభుత్వాలు మారుతున్నా.. తమ ఇబ్బందులు పట్టించుకునే వారే లేరని గిరిజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే తమ పరిస్థితులు మరింత దారుణమని ఆందోళన వెలిబుచ్చుతున్నారు. జ్వరాలు, వ్యాధులు, ప్రసవ వేదనలు ఎదురైతే మంచాలే స్ర్టెచర్లుగా వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అన్నీ తెలిసిన అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆదివాసి గూడేలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. కనీస సౌకర్యాలు కల్పించి అభివృద్ధికి పాటుపడాలి. పాలకవర్గాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని’’ తుడుందెబ్బ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పుర్క బాపురావు అన్నారు.

ఎడ్లబండ్లపైనే ప్రయాణం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 44 పాత మండలాలు ఐటీడీఏ పరిధిలో ఉన్నాయి.  ఉట్నూర్ మండల పరిధిలోని నర్సాపూర్, జె.వంకతుమ్మ, రాజులమడుగు, చాప్రాల, లేండిగూడ తదితర గ్రామాలకు కనీస రోడ్డు మార్గం లేదు. దీంతో వ్యాధులు, జ్వరాలు, అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు ఆస్పతులకు చేరుకోలేకపోతున్నారు. అంబులెన్స్ వచ్చే మార్గం లేక ఎఢ్లబండ్లపై బయలు దేరి సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు.