vatuvarlapally villagers protest on national highway 
తెలంగాణ

‘రీలొకేషన్‌ వద్దు.. శ్రీశైలం రహదారిపై వటువర్లపల్లి గ్రామస్తుల ఆందోళన

నాగర్‌కర్నూల్ జిల్లా వటువర్లపల్లిని తరలించవద్దని గ్రామస్థులు NH 765పై నిరసన చేపట్టారు. గ్రామాన్ని ఖాళీ చేయించకుండా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

Suryanarayana

ప్రభాత ఉదయం, అచ్చంపేట : రీలొకేషన్‌ వద్దు.. మా ఊరే ముద్దు’, ‘గ్రామాన్ని తరలించొద్దు.. అభివృద్ధి చేయండి’ అంటూ నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం వటువర్లపల్లి గ్రామస్థులు మంగళవారం హైదరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారి 765పై ఆందోళన చేపట్టారు. తమను గ్రామం నుంచి ఖాళీ చేయించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామైంది.

పుట్టిన ఊరును వదిలి వెళ్లం
రీలొకేషన్‌ పేరుతో అధికారులు గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. కొంతమందిని ప్రలోభపెట్టి గ్రామం నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మేము ఇక్కడే పుట్టాం.. ఇక్కడే పెరిగాం.. ఇక్కడే చస్తాం. మా స్వగ్రామాన్ని విడిచి వెళ్లే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘ప్యాకేజీలు వద్దు.. ప్రజల హక్కులను పరిరక్షించండి’’ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం గ్రామానికి అభివృద్ధి పనులు మంజూరు చేస్తుంటే.. అటవీశాఖ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

అభివృద్ధి పనులకు అడ్డంకులంటూ ఆరోపణలు
గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఎమ్మెల్యే చొరవతో మంజూరైన ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేయించారని ఓ గ్రామస్థుడు పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాల ప్రహరీ, వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులు చేపట్టవద్దంటూ కాంట్రాక్టర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణం కోసం తెచ్చుకునే ఇసుక, కంకర లారీలను సైతం అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారినీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.

తరలింపు ప్రయత్నాలు విరమించుకోవాలి
వటువర్లపల్లి గ్రామాన్ని తరలించే ప్రయత్నాలను అటవీశాఖ అధికారులు విరమించుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. గ్రామాన్ని ఖాళీ చేయించడానికి బదులుగా మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో మాజీ సర్పంచ్‌లు చత్రు నాయక్‌, సర్య నాయక్‌, వార్డు సభ్యులు చిట్టెమ్మ, మౌనిక, వెంకటపతి, మాజీ వార్డు సభ్యులు సాలమ్మ, భరత్‌, రమేశ్‌, గ్రామ పెద్దలు ఇమ్మడి కిష్టయ్య, కాశయ్య, భవాని, సత్తి, అంజయ్య, కృష్ణా నాయక్‌, రత్యా నాయక్‌, మహిళా సంఘాల నాయకులు జ్యోతి, అనసూయ, ఈదమ్మ, యువకులు ప్రభాకర్‌, అనిల్‌, అఖిల్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.