హకీంపేట రైతుమేళా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా. 
తెలంగాణ

‘రైతుమేళా’కు పకడ్బందీ ఏర్పాట్లు : వికారాబాద్​ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ

నవంబర్ 7 నుంచి 9 వరకు హకీంపేటలో నిర్వహించనున్న రైతుమేళాకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, పరిగి/కొడంగల్ : నవంబర్‌ 7, 8, 9 తేదీల్లో వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం హకీంపేట శివారులో నిర్వహించనున్న రైతుమేళాకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ దీపక్‌ తివారీ అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ స్నేహ మెహ్రాతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు నోడల్‌ అధికారులుగా వ్యవహరించాలన్నారు. రైతులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రైతుమేళా ప్రాంగణంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడంతోపాటు సీసీ కెమెరాలు అమర్చాలని, వీవీఐపీలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం బహిరంగ సభ ప్రదేశం, స్టాళ్ల ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ సచిన్‌ బస్వరాజ్‌ గుట్టూరు, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తాండూరు ఆర్డీవో అనిత, జిల్లా వ్యవసాయ అధికారి కవిత, తహసీల్దార్‌ కిషన్‌నాయక్‌, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.