కొన్ని దృశ్యాలు కేవలం కళ్లకు అందంగా కనిపిస్తాయి.. మరికొన్ని గత చరిత్రను కళ్లముందు నిలుపుతాయి. అలాంటి చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన 1937 నాటి అరుదైన ప్యాకర్డ్ కారు హైదరాబాద్‌లోని గోల్కొండ సమీపంలో కనువిందు చేసింది. ఫొటోగ్రాఫర్ కరికాల మాణిక్యం తన కెమెరాలో ఈ చిత్రాన్ని బంధించారు. ఆగస్టు 19న మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీలో నిర్వహించిన ‘ఫొటోవాక్ హైదరాబాద్ ఫొటోగ్రఫీ’ పోటీలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిజాం పాలన కాలంలో హైదరాబాద్ సంస్థాన పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన నవాబ్ రెహ్మత్ యార్ జంగ్ ఈ కారు వాడినట్లు ప్రచారం ఉంది. అప్పట్లో రాజసం, హోదాకు ప్రతీకలుగా నిలిచిన వాహనాల్లో ప్యాకర్డ్ ఒకటి. కాలం మారినా చెక్కుచెదరని ఆ కారు రూపం.. నాటి ఆటోమొబైల్ కళానైపుణ్యాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ఇది సాధారణంగా పాత కారు మాదిరిగానే కనిపించినా, దాని వెనుక దాగిన చరిత్రను తాజాగా కెమెరా క్లిక్‌తో ఆవిష్కరించారు మాణిక్యం. ఈ ఫొటోను చూసిన సందర్శకులు, తోటి ఫొటోగ్రాఫర్లు మంత్రముగ్ధులై మాణిక్యంను అభినందనలతో ముంచెత్తారు. ఆయన కెమెరాలో బంధించింది ఓ వింటేజ్ కారును మాత్రమే కాదు.. కాలగర్భంలో కలిసిపోకుండా నిలిచిన హైదరాబాద్ గత వైభవాన్ని కూడా..!