వరంగల్‌లో బియ్యం షాపులపై లీగల్ మెట్రాలజీ అధికారుల ఆకస్మిక తనిఖీలు 
తెలంగాణ

తూకంలో మోసం.. 10 మంది బియ్యం వ్యాపారులపై కేసులు!

వరంగల్‌లో కొందరు బియ్యం వ్యాపారులు 50 కిలోల బియ్యం బస్తాపై కిలో నుంచి కిలోన్నర వరకు తక్కువ తూకం వేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, వరంగల్​: కరువు పరిస్థితుల నేపథ్యంలో బియ్యం ధరలు పెరగగా.. తూకంలో మోసం చేస్తూ బియ్యం వ్యాపారులు జనానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. వరంగల్​లో కిరాణా షాపులు, జనరల్ స్టోర్లలో బియ్యం తక్కువ తూకం వేస్తూ జనాన్ని మోసం చేస్తున్నారు. ఒక్కో 50కేజీల బ్యాగుపై కేజీ నుంచి కేజీన్నర తక్కువ తూకం వేస్తున్నారు. ఇప్పటికే బియ్యం ధరలు పెరగగా, తూకం కూడా తక్కువ వేస్తుండడంతో జనం తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులకు సమాచారం అందడంతో శనివారం పాత బీటుబజారు, ఎల్లమ్మ బజారు, కాశిబుగ్గ ప్రాంతాల్లోని కిరాణాలు, జనరల్​ స్టోర్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. దీంతో తక్కువ తూకంతో మోసం చేస్తున్న వ్యాపారుల గుట్టు రట్టయింది. దాడుల్లో అధికారులు బియ్యం బస్తాలకు తూకం వేయగా.. 26 కేజీలుగా పేర్కొన్న బస్తాల్లో 25 కేజీల బియ్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. తూకంలో మోసం చేసిన 10 మంది వ్యాపారులపై మెట్రాలజీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల సమాచారం తెలిసి కొందరు వ్యాపారులు షాపులు బంద్​ చేసుకున్నారు. తక్కువ తూకంతో వినియోగదారులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ లీగల్ మెట్రాలజీ శాఖ అధికారి కూచన మనోహర్ హెచ్చరించారు. ‘ప్రతి వ్యాపారి ప్యాకింగ్​పై నికర బరువును స్పష్టంగా ముద్రించాలి. పేర్కొన్నదాని కన్నా తక్కువ బరువుతో సరుకులు అమ్మితే తూనికలు, కొలతల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.