Jalasiri Program in Adilabad 
తెలంగాణ

‘జలసిరి’తో కరువు దూరం

ఆదిలాబాద్ జిల్లాలో 1,786 ఫామ్ పాండ్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 31 కుంటలు మాత్రమే పూర్తయ్యాయి.

Munja Srinivas
ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత

ప్రభాత ఉదయం, ఆదిలాబాద్: జిల్లాలో వర్షాలు లేక కరువు ఛాయలు తాండవిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు తలెత్తనున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లాల వారీగా నీటి సంరక్షణ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ‘జలసిరి’ కార్యక్రమం చేపట్టి వాన నీటిని ఒడిసిపట్టేందుకు గ్రామాల్లో నీటి కుంటలు, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఎల్ నినో ప్రభావంతో నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.  

లక్ష్యం 1,786

ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ నిధుల ద్వారా నీటి సంరక్షణ చర్యలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పొలాల్లో 1786 ఫామ్ పాండ్స్ నిర్మించాలని లక్ష్యం విధించింది. ఇప్పటి వరకు 741 కుంటలు మంజూరు కాగా, 459 వివిధ దశల్లో ఉన్నాయి. కేవలం 31 మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో భాగంగా రైతులకు ఒక్కో నీటి కుంటకు రూ. 1.78 లక్షలు చెల్లించనుంది. ఇంకుడు గుంతలు 94,600 మంజూరు కాగా, వీటిలో 52 వివిధ దశల్లో ఉండగా, కేవలం ఆరు మాత్రమే పూర్తయ్యాయి. వీటికి ఒక్కో నిర్మాణానికి రూ. 6800 చొప్పున లబ్ధిదారులకు చెల్లించనున్నది. కమ్యూనిటీ ఇంకుడు గుంతలు 946 నిర్మించాల్సి ఉండగా, 263 మాత్రమే మంజూరయ్యాయి. 109 వివిధ దశల్లో ఉన్నప్పటికీ, కేవలం 79 మాత్రమే పూర్తయ్యాయి. బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్స్ గ్రామానికి 10 చొప్పున టార్గెట్ విధించి జిల్లాలో 4730 నిర్మించనున్నారు. ఇందులో 93 మంజూరవ్వగా, 16 మాత్రమే పూర్తయ్యాయి. వీటితో పాటు వాగులపై నీటిని నిలుపుదల చేసేందుకు రూ.5 లక్షల నిధులతో చెక్‌డ్యామ్‌లు నిర్మించనుంది.

వేగంగా పనులు చేస్తేనే..

జిల్లాలో భూగర్భ జలాలను నిల్వ చేయడంలో కీలకమైన ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్, చెక్ డ్యామ్‌ల నిర్మాణాలపై దృష్టి సారించి పనులు చేపడితే కరువును అరికట్టవచ్చు. ‘ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఆయా అంశాల వారీగా మంజూరైన పనులు ప్రారంభించాలని సూచించాం. కొన్ని పూర్తి కాగా, మిగితావి వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని’ ఆదిలాబాద్ డీఆర్డీఓ రాథోడ్ రవీందర్ తెలిపారు.

జిల్లాలో చేపట్టే ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతల వివరాలు..

ఫామ్ పాండ్స్                   1786  

మంజూరైన కుంటలు           741

వివిధ దశల్లో                     459

పూర్తైనవి                          31

ఇంకుడు గుంతలు               94,600

వివిధ దశల్లో                     52

పూర్తైనవి                          6