తెలంగాణ

ఆరు మండలాల్లో కరువు లేదంట

యాదాద్రి జిల్లాలో వర్షాభావం, పంట నష్టాలు, భూగర్భ జలాల తగ్గుదల ఉన్నప్పటికీ అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Munja Srinivas

ప్రభాత ఉదయం, ​యాదాద్రి భువనగిరి: కరువు విషయంలో యాదాద్రి జిల్లాపై సర్కారు శీతకన్ను వేసింది. కరువు మండలాలను గుర్తించడంలో పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. కొన్నింటిని మాత్రమే జాబితాలో చేర్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యాదాద్రిలో 17 మండలాలు

యాదాద్రి జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి. ఎల్ ​నినో కారణంగా జిల్లాలో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ వర్షపాతం 591 మి.మీ. కురియాల్సి ఉండగా, 414.5 ఎంఎం మాత్రమే పడినట్లు వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. జిల్లాలో 30 శాతం లోటు వర్షపాతం నమోదు చేసింది. 2.30 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేయగా, ఇప్పటికే 15వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని వ్యవసాయశాఖ నివేదిక అందించింది. భూగర్భ జలాలు 11.31 మీటర్ల లోతుల్లోకి వెళ్లినట్టుగా గ్రౌండ్​ వాటర్​ శాఖ నమోదు చేసింది. జిల్లాలో 1155 చెరువుల్లో 50 శాతానికి పైగా నీరు లేదని పేర్కొంది. నీటి కొరత కారణంగా పశుగ్రాసం రేటు పెరిగిందని పశు సంవర్థక శాఖ నివేదికలో పేర్కొన్నది. తాగునీటి వనరులు 3114 ఉండగా, ఇప్పటికే కొన్ని ఎండిపోయాయని, అద్దెకు బోర్లు తీసుకొని నీటిని సరఫరా చేస్తున్నామని మిషన్​ భగీరథ నివేదిక అందించింది.

శాటిలైట్​ రిపోర్ట్​ ఆధారంగా.. ​   

వ్యవసాయ, అనుబంధ శాఖలు కరువుపై నివేదిక అందించినప్పటికీ.. ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆఫీసర్ల ఫీల్డ్​ నివేదకలను పక్కన పెట్టి శాటిలైట్​ రిపోర్ట్​ ప్రకారం ఆరు మండలాల్లో కరువే లేదని స్పష్టం చేసింది. 10 శాతం నుంచి 26 శాతం వరకూ లోటు వర్షపాతం ఉన్నట్లు తెలుస్తోంది. ఆలేరులో 26 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, చౌటుప్పల్​లో 22, నారాయణపూర్​లో 20, అడ్డగూడూరులో 16, గుండాలలో 10 , ఆత్మకూరు (ఎం)లో 4 శాతం నమోదైంది. వీటిని కరువు మండలాల జాబితాలో చేర్చలేదు.