ప్రభాత ఉదయం, యాదాద్రి భువనగిరి : పోచంపల్లి మండలంలోని ఓ రైస్ మిల్లులో భారీ మొత్తంలో సీఎమ్మార్ ధాన్యం మాయమైంది. ప్రభుత్వ ధాన్యం కొరత బయటపడటంతో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. రేవనపల్లిలోని ‘శ్రీ విజయదుర్గ పీబీఆర్‌ఐ’ రైస్ మిల్లులో సుమారు 3,731.016 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ గుర్తించింది. దీని విలువ మార్కెట్‌లో దాదాపు రూ.13.77 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రికార్డుల్లో ఉన్న లెక్కలకు, వాస్తవ నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ధాన్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ దాచేపల్లి హరికృష్ణ ప్రాథమికంగా నిర్ధారించారు. ధాన్యం మాయం కావడంపై భూదాన్ పోచంపల్లి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో మిల్లు భాగస్వాములు చిట్టిమల్ల శ్రీనివాస్, అర్ధం అశోక్, మాశెట్టి కృష్ణమూర్తి, గార్లపాటి కృష్ణమూర్తి, చిట్టిమల్ల సువర్ణ, చిట్టిమల్ల లక్ష్మయ్య, గార్లపాటి భానుప్రకాశ్, సోమ శ్రీనివాస్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్ద మొత్తంలో ధాన్యం కొరత ఏర్పడటానికి గల కారణాలు, నిందితుల పాత్రపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.