యాదగిరిగుట్ట, ప్రభాత ఉదయం : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తరహాలో యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి విశ్వవిద్యాలయం (ఎస్ఎల్ఎన్ఎస్) ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం యాదగిరిగుట్ట ఆలయ పాలకమండలి ఇప్పటికే తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపింది. కల్యాణమండపం, స్వాగత తోరణం భూమిపూజ సందర్భంగా వైటీడీ బోర్డు చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం ఆమోదించగానే భూసేకరణ, పరిపాలనా విభాగాల ఏర్పాటు తదితర కార్యాచరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం పెద్దగుట్ట పరిధిలోని టెంపుల్ సిటీలో పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. వీటన్నింటినీ విడివిడిగా కాకుండా ఒకే యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా 20 ఎకరాల్లో రూ.183 కోట్లతో మెడికల్ కాలేజీ, 15 ఎకరాల్లో రూ.43 కోట్లతో వేద పాఠశాల, ఆరు ఎకరాల్లో రూ.35 కోట్లతో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. వేద పాఠశాల, మెడికల్ కాలేజీ పనులకు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం వీటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఎడ్యుకేషనల్ హబ్‌గా..
గుట్టలో యూనివర్సిటీతో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటైతే ఇంజినీరింగ్, సైన్స్, ఆర్ట్స్, కామర్స్ కోర్సులతోపాటు ఉన్నతస్థాయి పరిశోధనలు అందుబాటులోకి వస్తాయి. బోధన, బోధనేతర సిబ్బందితోపాటు అనుబంధ రంగాల్లో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఉన్న యాదగిరిగుట్టకు విద్యా కేంద్రంగానూ జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. వైదిక శాస్త్రాలు, ఆలయ శిల్పకళ, సంస్కృతం, పర్యాటకం, ఆతిథ్య రంగాలకు సంబంధించిన ప్రత్యేక కోర్సులను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. యూనివర్సిటీ ఏర్పాటుతో పరిసర ప్రాంతాల్లో రహదారులు, రవాణా వ్యవస్థ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.