YTD Board Meeting 
తెలంగాణ

యాదగిరిగుట్టలో కొత్త ఆర్చిగేటు.. నిత్యకల్యాణ మండపం : వైటీడీ బోర్డు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్ర సమగ్రాభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా వైటీడీ పాలకమండలి ముందుకు సాగుతోందని బోర్డు చైర్మన్‌ మన్నె సత్యనారాయణరెడ్డి తెలిపారు.

Madhu

ప్రభాత ఉదయం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్ర సమగ్రాభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా వైటీడీ పాలకమండలి ముందుకు సాగుతోందని వైటీడీ బోర్డు చైర్మన్‌ మన్నె సత్యనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్టలోని ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో వైటీడీ ధర్మకర్తల మండలి మూడో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చైర్మన్‌.. క్షేత్రంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుదల, ఆలయ సంప్రదాయాల పరిరక్షణ, భక్తులకు సౌకర్యాల విస్తరణకు సంబంధించిన అంశాలకు సమావేశంలో ప్రాధాన్యమిచ్చినట్లు వెల్లడించారు. ఈ భేటీలో 17 ప్రధాన అజెండా అంశాలతోపాటు మరో ఆరు టేబుల్‌ అజెండా అంశాలకు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

సంస్కృత విద్యాపీఠానికి శాశ్వత భవనం

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ( హెచ్‌ఏఎల్‌) సంస్థ అందించే సీఎస్‌ఆర్‌ నిధులతో దేవస్థానం పర్యవేక్షణలో సంస్కృత విద్యాపీఠానికి శాశ్వత భవనాన్ని నిర్మించనున్నారు. కొండపైకి వచ్చే భక్తుల పాదరక్షల భద్రత కోసం దేవస్థానమే ఉచిత కేంద్రాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

కొత్త ఆర్చిగేటు.. నిత్యకల్యాణ మండపం

రాయిగిరి వద్ద ప్రస్తుతం ఉన్న స్వాగత తోరణం స్థానంలో ఆకర్షణీయమైన కొత్త ఆర్చిగేటును నిర్మించనున్నారు. కొండపైన పాత బాలాలయం ప్రాంగణంలో రంగమంటపం (నిత్యకల్యాణ మండపం) ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు నిర్మాణాలకు ఈ నెల 30న శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించనున్నారు. నూతన కల్యాణ మండపం నిర్మాణ నమూనాలకు బోర్డు ఆమోదం తెలిపింది. పాతగుట్టలోని ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని దాతల భాగస్వామ్యంతో చేపట్టేందుకు కూడా నిర్ణయం తీసుకుంది.

 వేద మహాసభలు..కార్తీక మాస ఉత్సవాలకు

హైదరాబాద్‌కు చెందిన జనార్దన సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 1 వరకు నిర్వహించనున్న తెలంగాణ వేద విద్వాన్‌ మహాసభలకు రూ.13.66 లక్షలతో ఏర్పాట్లు చేయనున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 20 నుంచి 22 వరకు మూడు రోజులపాటు స్వామివారి సన్నిధిలో కార్తీక ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఆలయ రెగ్యులర్‌ సిబ్బందితోపాటు పెన్షనర్లకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పెరిగిన డీఏ, డీఆర్‌ మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు విజయేందర్ గౌడ్, ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, స్వాతి, రాఘవేందర్‌రావు, లక్ష్మీనారాయణ నాయక్, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, ఆలయ భవానీశంకర్, ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు పాల్గొన్నారు. కొణిదెల సురేఖ, గడ్డం వినోద్ వెంకటస్వామి, సీఎల్ విజయరాజం అనివార్య కారణాలతో బోర్డు మీటింగ్‌కు హాజరుకాలేదు.