తెలంగాణ

దీపావళి వేళ.. యాదగిరిగుట్ట ఆలయ సమయాల్లో మార్పులు

దీపావళి సందర్భంగా నవంబర్ 8న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పూజా వేళల్లో మార్పులు చేశారు. సుప్రభాత సేవ టికెట్లు రద్దు చేశారు. సోమవారం నుంచి పూజలు సాధారణ సమయాల్లోనే కొనసాగనున్నాయి.

Phaneendra

యాదగిరిగుట్ట, ప్రభాత ఉదయం : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్య కైంకర్యాల సమయాల్లో మార్పులు చేసినట్లు ఆలయ కార్య     నిర్వహణాధికారి భవానీ శంకర్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 8న ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ టికెట్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 3:30 నుంచి4 గంటల వరకు సుప్రభాతం, ఉదయం 4 నుంచి 4:45 గంటల వరకు స్వామివారికి ఆస్థాన మంగళ హారతులు, ఉదయం 4:45 నుంచి 5:45 గంటల వరకు స్వామివారికి తిరువారాధన, బాలభోగము, ఆరగింపు, ఉదయం 5:45 నుంచి 6:45 గంటల వరకు నిజాభిషేకం, ఉదయం 6:45 నుంచి 7:15 గంటల వరకు సహస్రనామార్చన, ఉదయం 7:15 గంటల నుంచి ఉభయ దర్శనాలు, నిత్యకల్యాణం తదితర ఆలయ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మార్పులు ఆదివారం ఒక్కరోజుకే వర్తిస్తాయని, భక్తులు సహకరించాలని కోరారు. సోమవారం నుంచి పూజలు యథాతథంగా ఉంటాయన్నారు.