ప్రభాత ఉదయం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మొక్కు వస్త్రాల సేకరణ కాంట్రాక్టు పొడిగింపునకు బ్రేక్ పడింది. ఏకపక్షంగా ఇచ్చిన కాంట్రాక్టు పొడిగింపును హైకోర్టు తప్పు పట్టడంతో దేవాదాయ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గతంలో ఇచ్చిన పొడిగింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ, త్వరలో పారదర్శకంగా టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. యాదగిరిగుట్ట, పాతగుట్ట ఆలయాల్లో భక్తులు స్వామివారికి సమర్పించే మొక్కు వస్త్రాల సేకరణకు సంబంధించి 2025 ఫిబ్రవరి 6న వేలం నిర్వహించారు. డి. నాగరాజు అనే కాంట్రాక్టర్ 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఏడాది కాలానికి లైసెన్స్ దక్కించుకున్నారు. గడువు ముగిసిన తర్వాత కొత్తగా టెండర్లు పిలిచి వేలం నిర్వహించాల్సి ఉంది. అయితే, సదరు కాంట్రాక్టును 2028 మార్చి 31 వరకు మరో మూడేళ్లపాటు పొడిగిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కాంట్రాక్టు పొడిగింపును వ్యతిరేకిస్తూ స్థానికుడు అన్నల్దాస్ వెంకటేశ్ సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి అందరికీ సమాన అవకాశం కల్పించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కాంట్రాక్టు పొడిగింపు వ్యవహారంలో అధికారుల ఏకపక్ష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సెప్టెంబర్ 23న ఆదేశాలు జారీ చేసింది.
పొడిగింపు ఉత్తర్వులు రద్దు..
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు గతంలో ఇచ్చిన కాంట్రాక్ట్ పొడిగింపు ఉత్తర్వులను రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం అక్టోబర్ 8న అధికారిక మెమో ద్వారా ఆమోదించింది. హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ మెమో ఆధారంగా ఆలయ ఈవో భవానీ శంకర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాత కాంట్రాక్టర్ లైసెన్స్ గడువు ముగిసినట్లయింది. ప్రస్తుతం దేవస్థానమే నేరుగా మొక్కు వస్త్రాలను సేకరించి విక్రయిస్తోంది. త్వరలో టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈవో ప్రకటించారు. ఈ ప్రక్రియను ఉన్నతాధికారుల ముందస్తు అనుమతితో చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం అర్హులైన ఎవరైనా వేలంలో పాల్గొనవచ్చని స్పష్టం చేశారు.