పరిషత్ పోరుకు సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 2.61 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
MPTC and ZPTC polling at local body election centres in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు
Published on: 

ప్రభాత ఉదయం, అమరావతి: రాష్ట్రంలో మండల ప్రజా పరిషత్‌(ఎంపీటీసీ), జిల్లా ప్రజా పరిషత్‌(జడ్పీటీసీ) ఎన్నికలు గురువారం నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 2,61,52,377 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 659 జడ్పీటీసీ స్థానాల్లో 77 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 582 స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. ఈ స్థానాల్లో మొత్తం 2,169 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 659 మండల ప్రజా పరిషత్తుల్లో మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాల్లో 2,051 చోట్ల ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,767 స్థానాల్లో మొత్తం 18,843 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మూడు స్థానాల్లో పోలింగ్‌ జరగడం లేదు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కొండాపురం మండలం సుగుమంచిపల్లి 1, 2 ఎంపీటీసీల్లో నామినేషన్లు రాలేదు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కృష్ణాగి ఎంపీటీసీలో అన్ని నామినేషన్లు రద్దయ్యాయి.

7,160 అత్యంత సున్నిత కేంద్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా 31,460 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 8,904 సున్నిత, 7,160 అత్యంత సున్నిత కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. 16,064 కేంద్రాల్లో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. 15,396 సాధారణ కేంద్రాలు, 6,000 కేంద్రాల్లో ల్యాప్‌టాప్‌ల ద్వారా వెబ్‌కాస్టింగ్, 6,507 కేంద్రాల్లో వీడియోగ్రఫీ చేయనున్నారు. జడ్పీలకు 28, మండలాలకు 659 రిటర్నింగ్‌ అధికారులు, 1,052 సహాయ రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. ప్రిసైడింగ్‌ అధికారులు 36,684, సహాయ పోలింగ్‌ అధికారులు 2,482, ఇతర పోలింగ్‌ అధికారులు 1,51,156 మంది విధుల్లో ఉంటారు. జోనల్‌ అధికారులు 2,274, మైక్రో అబ్జర్వర్లుగా 6,781 మందిని నియమించారు. ఎన్నికల భద్రత కోసం 40,679 మంది పోలీసు సిబ్బందిని వినియోగించనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. వర్షాల ప్రభావం, పోలింగ్‌ కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది సంసిద్ధత తదితర అంశాలపై సమగ్రంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్రపునేఠ కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. వాతావరణ పరిస్థితులు, స్థానికంగా నెలకొన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు పునేఠా సూచించారు.

23న డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక

రాష్ట్రంలో నిర్వహించిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 13 మున్సిపల్‌ కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్​ను ఈసీ అనిల్​చంద్ర పునేఠా బుధవారం విడుదల చేశారు. షెడ్యూల్​లో భాగంగా ఈ నెల 18వ తేదీ లోపు ఎన్నికల నోటీసు జారీ, 23న పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయా స్థానిక సంస్థలకు ఎన్నికైన వార్డు సభ్యులు, చైర్‌పర్సన్లు, మేయర్లు ఎన్నికైన ఒక వార్డు సభ్యుడిని డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నుకోనున్నట్లు ఈసీ పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల నవంబర్‌ 23న పరోక్ష ఎన్నికలు నిర్వహించకపోతే యెడల ఎన్నికల ప్రక్రియను నవంబర్‌ 24న పూర్తి చేయాలని ఈసీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.