ప్రైవేటు, విదేశీ వర్సిటీలకు పచ్చజెండా

Andhra pradesh cabinet meeting
Andhra pradesh cabinet meeting
Published on: 
  • ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

  • 'విద్యా చట్టం–1982’కు సవరణలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, విదేశీ ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలతో పాటు విదేశీ ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందుకు అనుగుణంగా ఏపీ విద్యా చట్టం–1982లో మార్పులు చేస్తామని ప్రకటించింది. ఈ సమావేశంలో మొత్తం 12 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది.

కేబినెట్​ కీలక నిర్ణయాలివీ

·   రూ.20.62 కోట్లతో ఏపీహెచ్‌ఐఎంఎస్ ప్రాజెక్టుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

· ఐఐటీ –జేఈఈ, నీట్​కు ఇంటెన్సివ్‌ రెసిడెన్షియల్‌ కోచింగ్‌ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.

· సేవలో ఉండగానే మరణించిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ప్రతి ఏడాది రూ.5 వేలు చొప్పున గరిష్ఠంగా రూ.1.50 లక్షల గ్రాట్యుటీని ఇవ్వనున్నారు.

· 2026-27 ‘తల్లికి వందనం’ పథకం మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు అధికారిక ఆమోదం (రాటిఫికేషన్‌) ఇచ్చారు.

· సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో డైట్‌ చార్జీల పెంపుపై ఉత్తర్వులకు ఏపీ మంత్రివర్గం రాటిఫికేషన్‌ ఇచ్చింది.

· కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారుల అతిథి గృహం కోసం 1.69 ఎకరాల భూమి వర్గీకరణ మార్పులను ఆమోదించారు.

· ఎన్టీఆర్ జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ పోరంబోకు భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు జారీ చేసిన ఉత్తర్వులకు రాటిఫికేషన్‌ ఇచ్చారు.

· వైఎస్సార్‌ కడప జిల్లా పాతూరులో ఆలయ అభివృద్ధికి 7.66 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవాదాయ శాఖకు బదలాయించే ప్రతిపాదనను ఆమోదించారు. 

· రేపల్లె 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు పచ్చజెండా ఊపారు. రేపల్లె ఏరియా ఆస్పత్రి అప్‌గ్రేడేషన్‌కు రూ.58.42 కోట్లు, అదనంగా 66 పోస్టుల మంజూరుకు అనుమతి ఇచ్చారు.

· విశాఖ మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

· ప్రకాశం జిల్లా కొండపిలో బాలుర రెసిడెన్షియల్‌ స్కూల్‌, హాస్టల్‌ కోసం 7 ఎకరాల భూమి వర్గీకరణ మార్పులను కేబినెట్ ఆమోదించింది.